MP Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబీఐ షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే అవినాష్ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అభ్యంతరాలను కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ని కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేసిన సిబిఐ అవినాష్ రెడ్డి చేయాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 11న ఈ కేసు విచారించాలని నిర్ణయించింది.
వాస్తవానికి జూలై నుంచి వివేకా హత్య కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదు. సిబిఐ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. జూన్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ గడువు పూర్తయినా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. కానీ దర్యాప్తునకు సమయం కావాలని సీబీఐ కోరలేదు. దీంతో విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ వరకు వాయిదా వేసింది. ఇంతలో సునీత వేసిన పిటీషన్ న్యాయస్థానం ముందుకు వచ్చింది. దీంతో కోర్టు ఆదేశాలతో సిబిఐ తప్పనిసరి పరిస్థితుల్లో అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చింది.
అటు గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ల పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశమని వ్యాఖ్యానించింది. కేసు వివరాలను సీల్డ్ కవర్లో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లాయర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ తో పాటు పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరడంతో కోర్టు స్పందించింది. ఈనెల 11న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.