YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ట్విస్ట్. మరోసారి విచారణకు హాజరుకావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం కడపలో ఉన్న అవినాష్ రెడ్డి హైదరాబాద్ సెడన్ గా బయలుదేరి వెళ్లారు. అయితే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నోటీసులివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ కీలక అరెస్టులుంటాయని భావిస్తున్న తరుణంలో తాజా నోటీసులతో కలకలం రేగింది. అటు అధికార వైసీపీలో సైతం ఆందోళన కనిపిస్తోంది.
వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాత ఎంపీ అవినాష్ రెడ్డికి ఇప్పటికే పలుమార్లు సీబీఐ నోటీసులు ఇచ్చింది. తాజాగా మంగళవారం ఆయన మరోసారి విచారణకు హాజరుకానునా్నరు. గతంలో సీబీఐ అరెస్టులుంటాయని భావించి చాలాసార్లు కోర్టులో పిటీషన్లు వేశారు. గత నెలలో తెలంగాణ కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విచారణకు సహకరించాలని కోర్టు పేర్కొంది. సీబీఐ అధికారుల ప్రశ్నలను లిఖితపూర్వగా తెలియజేయాలని, అవినాష్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని సూచించింది. అయితే కేసు విచారణలో కీలక అంశాలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు ఏకంగా నోటీసులివ్వడం సంచలనం రేకెత్తిస్తోంది. అరెస్టుకేనంటూ ప్రచారం ప్రారంభమైంది.
కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత సీబీఐ దూకుడు పెంచుతుందని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే సీబీఐ ఫోకస్ పెట్టడం విశేషం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు డైవర్సన్ పాలిటిక్స్ కు జగన్ సర్కారు దిగుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు నివాసముంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయడం వెనుక కూడా ఏదో జరగకూడనిది జరుగుతుందన్న అనుమానం ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డికి నోటీసులివ్వడంతో ఏదో సంచలనం నమోదుకానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. రేపు విచారణకు హాజరైన తరువాత అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటారా? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్ష్ గానే ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు దీనిపై క్లారిటీ రానుంది.