Sugali Preeti Case : సుగాలి ప్రీతి( sugali Preeti) కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అనేక మలుపులు తిరుగుతూ ఏళ్ల తరబడి దర్యాప్తుకు నోచుకోలేదు ఈ కేసు. అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్. సిబిఐ ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పుకుందంట. అనేక కేసులతో బిజీగా ఉన్న తరుణంలో కేసు దర్యాప్తు చేయలేమని.. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మూడు రోజుల కిందట సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసు మరోసారి చర్చకు వచ్చింది. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసును దర్యాప్తు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న ఈ కేసులో చిన్నపాటి కదలిక కూడా లేదు. ఇప్పుడు ఏకంగా సిబిఐ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రారంభం అయ్యాయి.
* అనుమానాస్పద స్థితిలో మృతి
2017 ఆగస్టు 19న సుగాలి ప్రీతి బాయ్( sugali Priti Bai ) అనే 15 సంవత్సరాల బాలిక కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విద్యాసంస్థ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినది. సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పాఠశాల యాజమాన్యం చెబుతుండగా.. స్కూల్ యజమాని కుమారులు అఘాయిత్యం చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పట్లో పోస్టుమార్టం రిపోర్ట్ లో సైతం తల్లిదండ్రులు అనుమానం పడినట్టే వెలుగు చూసింది. ఆమెపై అఘాయిత్యం జరిగిందని నిర్ధారణ అయింది. దీనిని ఆధారంగా చేసుకుని అప్పట్లో మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తోపాటు వాళ్ళ సెక్షన్లో కింద కేసులు నమోదు చేశారు. అప్పట్లో ప్రజాసంఘాల ఆందోళనల నేపథ్యంలో అప్పటి కర్నూలు కలెక్టర్ ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సైతం బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్లు నివేదిక ఇచ్చింది. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయితే అక్కడకు 23 రోజులకే నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ నాటి నుంచి బాలిక తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు.
* పవన్ కళ్యాణ్ ను కలిసిన తల్లి
సుగాలి ప్రీతి తల్లి ఓ దివ్యాంగురాలు. అప్పట్లో ఆమె జనసేన( janasena ) కార్యాలయానికి వచ్చి తన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan) వివరించింది. దీంతో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విషయం పై మాట్లాడారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పై దాడి సందర్భంలో కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించారు. 14 ఏళ్ల ఆడబిడ్డ స్కూల్ కి వెళ్తే పదిమంది నాశనం చేసిన పట్టించుకోలేదని.. గులకరాయి తగిలి చిన్న బొక్క పడితే రాష్ట్రమంతా ఊగిపోతోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. సగటు మనిషి బాధ నీకు తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం తొలి కేసు విచారణ సుగాలి ప్రీతిదే అంటూ తేల్చి చెప్పారు.
* కూటమి వచ్చినా న్యాయం జరగలే
అయితే కూటమి( allians ) అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. నాడు ఈ కేసు విషయంలో ఎన్నో రకాల హామీ ఇచ్చారు. ప్రభుత్వం టేకప్ చేసే తొలి కేసు కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ కేసును దర్యాప్తు చేయలేమని ఏకంగా సీబీఐ చేతులెత్తేయడం విశేషం. దీనిపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ ఎంతవరకు స్పందించలేదు. కానీ ఈ నెల 13న సిబిఐ ఎస్పీ రఘురామరాజన్ కౌంటర్ దాఖలు చేశారు. సిబిఐ జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేదని తేల్చి చెప్పారు. తమకు ఉన్న పరిమితమైన వనరులతో ప్రీతి కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదు. తొలి కేసుగా టేకప్ చేస్తామన్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నారు. దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.