Cargo Airport Srikakulam: ఏపీకి ( Andhra Pradesh) మరో కొత్త ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఈసారి వెనుకబడిన జిల్లాకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అందుకే ఎయిర్పోర్టుల ఏర్పాట్లు ఏపీకి అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ఇప్పటికే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలోని మరో జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. దాదాపు 1200 ఎకరాల్లో కార్గో ఎయిర్పోర్టును నిర్మించాలని ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. పలాస నియోజకవర్గంలోని మందస, వజ్రపు కొత్తూరు సరిహద్దు ప్రాంతాల్లో ఇది ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతంలో పండే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్, స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
Also Read: మోడీ నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందా?
* వ్యవసాయ ఉత్పత్తులకు ప్రయోజనం
ప్రస్తుతం ఉద్దాన( uddanam ) ప్రాంతంలో జీడి, కొబ్బరి పంటలు విస్తారంగా పండుతున్నాయి. అదే సమయంలో సుదీర్ఘ తీర ప్రాంతం కూడా ఉంది. మత్స్యకారులు ఎక్కువగా చేపల వేటకు వెళుతుంటారు. అయితే వారు పట్టే చేపలకు మార్కెట్, రవాణా సదుపాయం తక్కువ. మరోవైపు మైదానం తో పాటు ఏజెన్సీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడ గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వాటికి సైతం ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో మార్కెటింగ్ తో పాటు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ వస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం.
* స్వాగతిస్తున్న వైనం..
సాధారణంగా ఇటువంటి వాటి నిర్మాణాల సమయంలో నిర్వాసితులు, స్థానికుల నుంచి వ్యతిరేకత రావడం కామన్. కానీ విశాల ప్రయోజనాల దృష్ట్యా వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో( Srikakulam ).. అందునా ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలన్న ప్రతిపాదనపై ఎక్కువ మంది స్వాగతిస్తున్నారు. అయితే 120 ఎకరాల భూమికి సంబంధించిన రైతులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణలో యంత్రాంగం ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక్కడ ఏర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే పలాస ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అభిప్రాయపడ్డారు. విమానాశ్రయం అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అందులో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు ఎమ్మెల్యే శిరీష. దయచేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎవరు అడ్డు చెప్పొద్దని కోరారు. దీంతో ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణం అనేది కచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టమైంది.
* 1200 ఎకరాల్లో..
మరోవైపు ఈ కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి 1200 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నారు రెవెన్యూ అధికారులు. అయితే ఇందులో 200 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ప్రధానంగా వజ్రపు కొత్తూరు మండలం చీపురుపల్లి, మెట్టూరు, అనకాపల్లిలో ఎక్కువగా భూమి సేకరిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు విమానాశ్రయాల అభివృద్ధి కోసం apadcl 1000కోట్ల రుణం తీసుకోనుంది. ఈ రుణానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. హార్డ్ కో ద్వారా ఈ రుణం తీసుకొనున్నారు.