Startup India : ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అనూహ్యంగా చోటు చేసుకుంటున్నాం యుద్ధాలు దేశాల ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదాయాల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. పైగా పనులు పెంచే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఒక దేశం ఆర్థికంగా నష్టపోతే ఆ ప్రభావం అనేక రంగాల మీద ఉంటుంది. ఫలితంగా దేశ ప్రజల భవితవ్యం ప్రమాదంలో పడుతుంది. అందువల్లే ప్రపంచ దేశాలు తమ ఆర్థిక ముఖచిత్రం గాడి తప్పకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రపంచం మొత్తం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పన్నుల విషయంలో పారదర్శకతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత వసూలు చేసే పన్నుల విషయంలో రకరకాల స్లాబ్ లను తెరపైకి తెచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లు జరుపుతూ వసూలు చేసే పన్నుల విషయంలో రకరకాల మార్పులు, చేర్పులు చేపడుతోంది. వాస్తవానికి రాబడి పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే తొలిసారిగా అధికంగా పన్నులు వచ్చే రంగంపై కేంద్రం ఉదారత చూపింది. అదే కాదు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
మనదేశంలో కొంతకాలంగా స్టార్టప్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగం లక్షల ఉద్యోగాలను సృష్టిస్తున్నది. పెద్దపెద్ద కంపెనీల వల్ల కూడా కానిది స్టార్టప్ రంగం వల్ల అవుతోంది. అంతటి కరోనాలో అనేక కంపెనీలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. కానీ స్టార్టప్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. పైగా ఆ సమయంలోనూ లక్షలాదిమందికి ఉపాధి కల్పించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి లాగా ఉన్న స్టార్టప్ రంగానికి మరింత ఊతం ఇవ్వడానికి ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అంతర్గత వాణిజ ప్రోత్సాహక విభాగం (DPIIT) ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 -IAC ప్రకారం 187 స్టార్టప్ లకు ఆదాయపు పన్ను మినహాయింపును కల్పించింది.. 79 వ ఐ ఎం బి సమావేశంలో 75 స్టార్టప్ లకు గతంలోనే కేంద్రం ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చింది.. 2030 వరకు పన్ను మినహాయింపు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కొత్తగా స్టార్టప్ లు ఏర్పాటు చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పన్ను మినహాయింపులు వారికి ఉపశమనంగా ఉంటాయి. పన్ను ఉపశమనం వల్ల కొత్త కంపెనీలు ఏర్పాటు కావడానికి అవకాశం ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తోంది. ప్రస్తుత కాలంలో ప్రభుత్వం కంటే ప్రైవేట్ రంగమే దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తోంది.