AP Capital : వచ్చే ఎన్నికల్లో రాజధాని అజెంగా ఉంటుందా? ఉండదా?

అయితే ఒక వేళ అమరావతికి ప్రతికూల తీర్పు వస్తే ఎదురుదెబ్బ పరిణమించే అవకాశముందని భయపడుతోంది. అందుకే వీలైనంత జాప్యం జరిగితే మేలని అంతర్గతంగా భావిస్తోంది. అయితే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారన్న అపఖ్యాతి మాత్రం వైసీపీకి అంటుకుంది. 

Written By: Dharma, Updated On : July 13, 2023 6:33 pm
Follow us on

AP Capital :  ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అజెండాతోనే రాజకీయ పార్టీలు ముందుకెళతాయి. గత ఎన్నికల్లో ఏపీలో ప్రత్యేక హోదాయే ప్రధాన అజెండాగా ఉండేది. అప్పటి కేంద్రం ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యలు పరిష్కరించకపోవడం లేదని టీడీపీ అజెండాగా తీసుకుంది. అటు వైసీపీ సైతం ప్రత్యేక హోదా చుట్టూనే రాజకీయం చేసింది. తమకు 25 మంది ఎంపీలను ఇవ్వండి.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాం అని ఊరు వాడా ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాత్రం వైసీపీ మాటలను నమ్మి ఆదరించారు. టీడీపీ మాటలను పెద్దగా విశ్వసించలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అజెండా, అంశం ఎదైనా ఉందంటే అది తప్పకుండా రాజధాని అంశమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు అమరావతి రాజధానిగా నిర్ణయించింది. అన్ని పార్టీల ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సేకరించింది. అమరావతి నిర్మాణం మొదలుపెట్టింది. కొన్ని నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. కానీ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో చంద్రబాబు ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉన్న అమరావతి పక్కకు వెళ్లింది. కొన్ని రోజుల పాటు స్తబ్ధుగా ఉన్నా.. మూడు రాజధానుల సంచలన నిర్ణయంతో జగన్ ప్రకంపనలే రేపారు. అమరావతి రైతులు, అన్ని రాజకీయ పక్షాలు ఒక వైపు… వైసీపీ సర్కారు మరోవైపు పోరాటం చేస్తోంది. చివరకు అది న్యాయస్థానానికి వెళ్లి తాత్కాలికంగా ఎండ్ కార్డు పడింది.

అయితే అమరావతి రాజధాని కేసు.. మిగతా వేలాది కేసులు మాదిరిగానే సుప్రీం కోర్టు పరిగణించింది. అందుకే విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఇటీవల ఒక అడుగు ముందుకేసిన అత్యున్నత న్యాయస్థానం ఇప్పట్లో కేసు విచారణ అసాధ్యమని తేల్చేసింది. డిసెంబరులో దర్యాప్తు చేస్తామని చెప్పుకొచ్చింది. దీంతో ఇది ఎన్నికల ముంగిట తేలే అంశం కాదని తేలిపోయింది. అయితే రాజధానుల నిర్ణయాల పర్యవసానాలను ఎన్నికల అజెండాగా చెప్పుకుందామనుకుంటున్న అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు ఇది ఒకరకమైన ఝలకే. అదే సమయంలో ఇరుపక్షాలు కూడా జాప్యాన్నే కోరుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడే రైతులు కోర్టును ఆశ్రయించారు. కానీ అప్పట్లో విచారణ ఆలస్యం కావాలని జగన్ సర్కారు కోరుకుంది. ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి  వేగంగా విచారణ పూర్తికావాలని కోరుతున్నా ఫలితం లేకపోతోంది. కానీ ప్రతికూల తీర్పు వస్తే పరిస్థితి ఏంటన్నది ఊహించుకోలేకపోతోంది. టీడీపీది అదే పరిస్థితి. అమరావతికి గట్టి మద్దతుగా నిలిచింది ఆ పార్టీ. రైతుల ముసుగులో టీడీపీయే న్యాయపోరాటం చేస్తోందని అధికార పక్షం ఆరోపిస్తోంది. అయితే ఒక వేళ అమరావతికి ప్రతికూల తీర్పు వస్తే ఎదురుదెబ్బ పరిణమించే అవకాశముందని భయపడుతోంది. అందుకే వీలైనంత జాప్యం జరిగితే మేలని అంతర్గతంగా భావిస్తోంది. అయితే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారన్న అపఖ్యాతి మాత్రం వైసీపీకి అంటుకుంది.