https://oktelugu.com/

Pawankalyan : ప్రత్యర్థులకు మనమే మార్గం చూపుతున్నాం..పవన్ షాకింగ్ కామెంట్స్

నాదేండ్ల మనోహర్ పై కొందరు బాహటంగానే విమర్శలకు దిగడంపై పవన్ సీరియస్ అయ్యారు. మనోహర్ ఏదీ చేసినా నాకు అడిగే చేస్తారని.. ఇష్టం ఉన్నవారు ఉండండి లేకుండే వెళ్లిపోండి అంటూ తేల్చిచెప్పారు.

Written By: Dharma, Updated On : July 13, 2023 6:22 pm
Follow us on

Pawankalyan : పవన్ సొంతింటిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గట్టి హెచ్చరికలే జారీచేస్తున్నారు. ప్రత్యర్థులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే.. అది సొంత వాళ్లు ఇంటి తలుపులు తీస్తే కదా సాధ్యమవుతుందన్న పవన్ మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పవన్ వారాహి యాత్రలో బిజీగా ఉన్నారు. రెండో విడత యాత్రలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. యాత్ర మధ్యలో నియోజకవర్గాల రివ్యూకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే పార్టీలో జరుగుతున్న అంతర్గత అంశాలపై మాట్లాడుతున్నారు.

ఇతర రాజకీయ పక్షాలు జనసేనను విమర్శించడం వేరు.. కానీ సొంత పార్టీ శ్రేణులే పార్టీని తక్కువ చేసి చూడడం మాత్రం దారుణమన్నారు. అటువంటి వారు పార్టీలో ఉండి విమర్శలు చేయడం కంటే బయటకు వెళ్లిపోవాలని పవన్ సూచించారు. జనసేన సంప్రదాయ పార్టీ కాదని.. సైద్ధాంతికతతోనే పోరాడుతుందని స్పష్టం చేశారు. అయితే పవన్ ఇలా మాట్లాడుతుండడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడారు. తన సభలు, సమావేశాలకు వచ్చిన వారిని చూసి భ్రమ పడ్డానని.. కానీ నా అంచనా తప్పిందంటూ చాలాసార్లు అభిమానుల గుండెలు వణికేలా మాట్లాడారు.

జనసేన ఆవిర్భావం నుంచి చాలామంది పవన్ వెంట నడిచారు. అందులో సినీ అభిమానులే అధికం. కానీ వారంతా ఓటర్లుగా మారకపోయారన్నది వాస్తవం. అదే సమయంలో పవనన్నకు జైకొడదాం..జగనన్నకు ఓటేద్దాం అన్న బ్యాచ్ ఒకటి ఉంది. చాలామంది నేతల వైఖరి కూడా అలానే ఉంది. ఇటువంటి వారితో పార్టీకి నష్టం జరగుతోంది. క్రమశిక్షణ కట్టుదాటడానికి ఇటువంటి వారు కారణమవుతున్నారు. కొద్ది నెలల కిందట పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ విషయంలో కూడా పవన్ కాస్తా గట్టిగానే మాట్లాడారు. నాదేండ్ల మనోహర్ పై కొందరు బాహటంగానే విమర్శలకు దిగడంపై పవన్ సీరియస్ అయ్యారు. మనోహర్ ఏదీ చేసినా నాకు అడిగే చేస్తారని.. ఇష్టం ఉన్నవారు ఉండండి లేకుండే వెళ్లిపోండి అంటూ తేల్చిచెప్పారు.

చాలాచోట్ల జనసేన నాయకులు అంతర్గతంగా వైసీపీ నేతలతో పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. పార్టీపరంగా గట్టిగానే పోరాడుతున్నా.. ఇటువంటి వారి అంతర్గత బంధం పార్టీకి నష్టం చేకూరుస్తోంది. అందుకే పవన్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. మన పోరాటానికి అటు నుంచి భారీ రిప్లయ్ వస్తున్న వేళ.. మనవారే అర్ధం చేసుకోకుండా రాంగ్ ట్రాప్ లో పడుతున్నారని అర్ధం వచ్చేలా ఇటీవల పవన్ వ్యాఖ్యానించారు. అంటే పవన్ వద్ద సైతం సమగ్ర సమాచారం ఉందన్న మాట. అందుకే అటువంటి వారికి సుతిమెత్తగా హెచ్చరికలు పంపిస్తున్నారు.