AP Women Sarpanch: ఏపీకి చెందిన మహిళా సర్పంచ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ప్రసంగించే ఛాన్స్ వచ్చింది. మహిళల విద్య, వైద్యం అనే అంశంపై ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్నారు పశ్చిమగోదావరి జిల్లా పేకేరు గ్రామ సర్పంచ్ కునుకు హేమకుమారి.దేశవ్యాప్తంగా పంచాయితీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా.. అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన హేమకుమారి పంచాయతీ అభివృద్ధిలో విశేష పాత్ర పోషించారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మే 3న జరగనున్న సదస్సులో హేమ కుమారి ప్రసంగించనున్నారు. ఆమెతోపాటు త్రిపుర నుంచి జడ్పీ చైర్ పర్సన్ సుప్రియ దాస్ దత్త, రాజస్థాన్ నుంచి సర్పంచ్ నీరు యాదవ్ హాజరుకానున్నారు. దేశంలో స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు, సాధించిన లక్ష్యాల గురించి మీరు ప్రసంగించనున్నారు. ఇటువంటి అరుదైన అవకాశం ఏపీకి చెందిన మహిళా సర్పంచ్కు దక్కడం అభినందనీయం.
2021 పంచాయతీ ఎన్నికల్లో పేకేరు గ్రామ సర్పంచ్ గా హేమకుమారి ఎన్నికయ్యారు. ఆమె విద్యాధికురాలు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. ఐదేళ్లపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్ గా పనిచేశారు.అయితే సర్పంచ్ పదవి అంటే బాధ్యత కానీ.. రాజకీయం కాదని హేమ కుమారి చెబుతున్నారు. దేశంలో ఈ అరుదైన అవకాశం దక్కడం ఆనందంగా ఉందని.. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.