Electricity Charges : ఏపీలో మరోసారి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు చార్జీల పెంపుపై డిస్కం లు ప్రతిపాదనలు పెడుతుండడంతో ఆమోదించక తప్పని పరిస్థితి ఈఆర్సి పై ఏర్పడింది. సర్దుబాటు చార్జీల పేరిట 2026 నవంబర్ వరకు అదనపు బాదుడు తప్పనిసరి. డిసెంబర్ నెల నుంచి వినియోగదారులపై 9,412 కోట్ల రూపాయల మేర భారం పడనుంది. యూనిట్ కు 92 పైసలు చొప్పున సర్దుబాటు చార్జీలను వసూలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇప్పటికే ట్రూ అప్ తో పాటు రెండు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ చార్జీలతో కరెంటు బిల్లులు అమాంతం పెరిగాయి. ఇప్పుడు ఈ సర్దుబాటు చార్జీలు దానికి తోడు కానున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లభించింది. దీంతో ఈ ఆర్ సి ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రజాభిప్రాయం తీసుకోకుండానే చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. విద్యుత్ చార్జీలు పెరగడం ఇది రెండోసారి.
* ఎవరొచ్చినా తప్పడం లేదు
ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సర్దుబాటు చార్జీల పేరిట బాదుడు తప్పడం లేదు.2023- 24 సంవత్సరానికి సంబంధించి రూ.12,844 ఓట్లు సర్దుబాటు చేసేందుకు ఈ ఆర్ సి కి డిస్కం లు ప్రతిపాదనలు పంపాయి. అందులో 3,432 కోట్లకు కోత విధించిన ఈఆర్ సి.. మిగిలిన రూ.7912 కోట్లను మాత్రం ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. దీనికి అనుమతులు రావడంతో వచ్చే నెల నుంచి ఒక్కో యూనిట్ కు అదనంగా 92 పైసలు వసూలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.
* ఈనెల నుంచే
ఏపీలో డిసెంబర్ నుంచి విద్యుత్ చార్జీల్లో అమాంతం మార్పులు కనిపించనున్నది. అన్ని ప్రాంతాల విద్యుత్ పంపిణీ వ్యవస్థల్లో చార్జీలు పెరగనున్నాయి. అయితే ఇప్పటికే ఒకసారి చార్జీలను పెంచింది ఏపీ సర్కార్. ఇప్పుడు రెండోసారి కావడంతో ప్రజల నుంచి ఆగ్రహాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అయితే సర్దుబాటు చార్జీలు పెంచక తప్పని పరిస్థితి అని డిస్కములు చెబుతున్నాయి.దీనిపై ప్రజా సంఘాలు ఉద్యమించడానికి సిద్ధమవుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.