AP Cabinet: ఏపీ ప్రభుత్వం ( AP government )కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు నేతలకు క్యాబినెట్ హోదా కల్పించారు. ఇప్పటికే వారు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. అందులో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ లకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. మరోవైపు నామినేటెడ్ చైర్మన్లకు సంబంధించి జీతాలు కూడా నిర్ణయించారు. అలాగే 12 కార్పొరేషన్ చైర్మన్ లను ఏ కేటగిరీలో కూడా చేర్చారు. ఆరు సంస్థల చైర్మన్ లను బీ కేటగిరిలో చేర్చారు.
* ఏ కేటగిరి చైర్మన్ లకు నెలకు రూ.1.25 లక్షల జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ.2,77500 ఉంటాయి.
* బి కేటగిరి చైర్మన్ లకు నెలకు 60 వేల జీతంతో పాటు అలవెన్స్లు కలిపి రూ. 1,93,500 వరకు చెల్లిస్తారు.
* దసరాకు మిగతా పదవులు..
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు కార్పొరేషన్ చైర్మన్ లను నియమించిన సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకోవైపు మార్కెట్ కమిటీ చైర్మన్లు, పిఎసిఎస్ అధ్యక్షులకు సంబంధించి నియామకాలు కూడా ఇంకా జరగనున్నాయి. అయితే చాలామంది ఆశావహులు ఉన్నారు. మూడు పార్టీల మధ్య పొత్తు ఉండడంతో.. పదవుల సర్దుబాటు అనేది సంక్లిష్టంగా మారింది. అయితే దసరాకు ముందే పెండింగ్లో ఉన్న మిగతా నామినేటెడ్ పోస్టులను సైతం భర్తీ చేస్తారని తెలుస్తోంది.