Donald Trump: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై విధించిన టారిఫ్‌ల విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఇప్పటికే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు అమలు చేస్తున్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు ఎత్తివేత విషయంలో భారత్ ఆలస్యం చేసిందంటూ పోస్టు పెట్టారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో టారిఫ్ తగ్గించే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. భారత్ దీర్ఘకాలంగా అమెరికాపై భారీ టారిఫ్‌లు విధిస్తోందని, దీని వల్ల అమెరికన్ కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విధానం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్థానిక ఉత్పత్తిని పెంచడం ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది.
కంపెనీలు వెనక్కి వస్తున్నాయట..
టారిఫ్‌ల ప్రభావంతో అమెరికా నుంచి వెళ్లిపోయిన కంపెనీలు వెనక్కి వస్తున్నాయని ట్రంప్ ప్రకటించారు. హార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీలు భారత్‌లోని అధిక టారిఫ్‌ల కారణంగా అక్కడ ఉత్పత్తి యూనిట్లను స్థాపించాయని, దీంతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు, ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపిందని ట్రంప్ ప్రకటించార. ఇలాంటి కంపెనీలను తిరిగి అమెరికాకు రప్పించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అదే సమయంలో, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాల నుంచి కూడా కంపెనీలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారత్–అమెరికా వాణిజ్యంపై ప్రభావం..
ట్రంప్ టారిఫ్ విధానం భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలను సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. భారత్ అధిక టారిఫ్‌లతో అమెరికన్ ఉత్పత్తులను నియంత్రిస్తుండగా, అమెరికా కూడా ప్రతిగా టారిఫ్‌లు విధించడం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలను దెబ్బతీస్తుంది. భారత్‌కు ఎగుమతి చేసే అమెరికన్ ఉత్పత్తులపై ఖర్చు పెరగడం వల్ల ధరలు పెరిగి, భారత మార్కెట్లో అమెరికన్ వస్తువుల పోటీతత్వం తగ్గే ప్రమాదం ఉంది.
అమెరికా టారిఫ్‌లను కొనసాగించడం ద్వారా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తప్పవు. ఒకవైపు అమెరికా స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు భారత్ వంటి దేశాలు తమ ఎగుమతులను రక్షించుకోవడానికి కొత్త వాణిజ్య వ్యూహాలను రూపొందించవచ్చు. ఇది దీర్ఘకాలంలో రెండు దేశాల ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది.