Sankranti 2025: సంక్రాంతికి సొంత గ్రామాలకు వస్తున్న ఏపీ ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న వారి విషయంలో పర్వాలేదు కానీ.. ఇప్పటికిప్పుడు స్వగ్రామాలకు వస్తాం అనుకున్న వారికి మాత్రం బస్సుల టిక్కెట్ల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల ( private buses ) దందా పెరిగింది. మూడింతల ధరలు పెంచి వసూలు చేస్తున్నారు. ప్రజల సెంటిమెంటును సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీ ప్రజలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఎంత దూరంలో ఉన్నా సంక్రాంతికి స్వగ్రామాలకు రావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానంగా కోస్తాంధ్ర, ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో సంక్రాంతికి ప్రతి ఒక్కరూ స్వగ్రామాలకు వస్తారు. దీనిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ( private bus operators ).
* ఏపీ ప్రజలకు రవాణా కష్టాలు
పేరుకే రాష్ట్ర విభజన కానీ. హైదరాబాదులో( Greater Hyderabad) ఉండేది సీమాంధ్ర ప్రజలే. సంక్రాంతి వచ్చిందంటే చాలు దాదాపు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. రైళ్లు, బస్సులు, కార్లు అన్ని ఏపీ వైపే దూసుకొస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ( special trains ) నడుపుతోంది. ముఖ్యంగా తిరుపతి, గోదావరి జిల్లాలు, విశాఖ తో పాటు శ్రీకాకుళం వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఎప్పటికప్పుడు రైళ్ల టికెట్లు బుక్ అవుతున్నాయి. రిజర్వేషన్లు సైతం పూర్తవుతున్నాయి. ఈ తరుణంలో ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్న వారి జేబులకు చిల్లు పడుతుంది. రెట్టింపు ధరలకు టిక్కెట్లు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
* మూడింతల పెరుగుదల
సాధారణ రోజుల్లో హైదరాబాదు నుంచి విశాఖ రావాలంటే బస్సు టికెట్ ధర 1500 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు 5000 రూపాయలు వసూలు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి తిరుపతికి 1300 రూపాయల టికెట్ ధర సాధారణ రోజుల్లో ఉండేది. ఇప్పుడు 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక స్లీపర్ కోచ్ ( sleeper coach) బస్సుల గురించి చెప్పనవసరం లేదు. 7000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నలుగురు కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్ర( North Andhra) వెళ్లాలంటే 20 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy ) ఏపీ ప్రభుత్వానికి ( AP government) ఒక రిక్వెస్ట్ చేశారు. సంక్రాంతి పూట బస్సుల దోపిడీ నియంత్రించాలని కోరారు. మొత్తానికైతే సంక్రాంతికి సొంత గ్రామాలకు వస్తున్న ఏపీ ప్రజలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.