Junior NTR : తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. తన దృష్టిని సినిమాలపైనే పెట్టారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నా.. రాజకీయాల మాత్రం ఆయనకు దూరం కావడం లేదు. ఆయన చుట్టూ రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికలకు ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించాలని చాలామంది ఆశించారు. కానీ ఆయన అవసరం లేకుండానే తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఎన్నికల అనంతరం కొందరు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకోవడం విశేషం. ముఖ్యంగా టిడిపి సీనియర్ నేత బుద్ధా వెంకన్న తారక్ పేరును ప్రస్తావిస్తూ రాజకీయ దుమారానికి కారణమవుతున్నారు. ఈ మధ్యకాలంలో తారక్ వరుసుగా ఇట్లు కొడుతూ సత్తా చాటుతున్నాడు. వరుసగా ఆరు హిట్లను సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ కూడా సాధించాడు. ఇప్పుడు అదే జోష్ తో స్టాఫ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఒకవైపు ఈ సినిమాలో నటిస్తూనే బాలీవుడ్లో వార్ 2 అనే చిత్రాన్ని మొదలు పెట్టేసాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ రాజకీయాల జోలికి పోవడం లేదు. అయినా సరే రాజకీయాల్లో వార్తల్లో నిలుస్తున్నాడు.
* వివాదాస్పద కామెంట్లతో
ఏపీ రాజకీయాల్లో అస్సలు తారక్ కనిపించడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీలోనే కొందరు తారక్ అంటే కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా లోకేష్ అనుచరులుగా చెప్పుకునే బుద్దా వెంకన్న వంటి వారు గట్టిగానే మాట్లాడుతున్నారు. కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బుద్దా వెంకన్న ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ నేను టిడిపిలోనే కొనసాగుతాను. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం. కానీ ఎన్టీఆర్ ను సపోర్ట్ చేయను’ అని పేర్కొన్నారు.
* లోకేష్ ఎన్టీఆర్ గారి మనవడే
ఇదే ఇంటర్వ్యూలో బుద్దా వెంకన్న కొనసాగిస్తూ ‘ తారక్ ఎన్టీఆర్ గారి మనవడే. కానీ ఆయన లాంటి మనవళ్ళు చాలామంది ఉన్నారు. లోకేష్ కూడాఎన్టీఆర్ గారి మనవడే. ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేయలేదా?’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బుద్దా వెంకన్న చేస్తున్న వ్యాఖ్యలు అతిగా ఉన్నాయని తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రాపకం కోసమే ఆయన అలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* తండ్రీ కొడుకుల ప్రాపకం కోసమేనా?
2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్దా వెంకన్న తెరపైకి వచ్చారు. లోకేష్ తో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా నామినేట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ను ఆశించారు. ఇందుకుగాను పెద్ద ప్రయత్నం చేశారు. ఏకంగా తన రక్తంతో చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ రాతలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో సుజనా చౌదరి పోటీ చేశారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభం కావడంతోనే బుద్దా వెంకన్న తారక్ పై విమర్శలకు దిగుతున్నారని.. చంద్రబాబు, లోకేష్ ల ప్రాపకం కోసమే నన్న విమర్శలు వినిపిస్తున్నాయి.