Malla Reddy Praises Chandrababu: రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండరు. ఇది ఎన్నో సందర్భాల్లో చూశాం. అయితే కొందరు నేతల మధ్య వ్యక్తిగత వైరం దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు దశాబ్దాల వైరమే. అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి ఇవ్వలేదని భావించి చంద్రబాబును విభేదించారు కేసీఆర్. ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పోస్ట్ తీసుకోకుండా ఏకంగా పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు. అయితే మధ్యలో 2009లో చంద్రబాబు పార్టీతో జత కలిపి మహాకూటమిగా ఏర్పడ్డారు కేసీఆర్. అది కూడా కొద్దికాలం స్నేహానికి పరిమితం అయింది. అటు తరువాత చంద్రబాబును ఏ విషయంలో కూడా ఏకీభవించలేదు. రాజకీయంగా దెబ్బతీయాలని చూశారు. అయితే ఇప్పుడు కెసిఆర్ పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదు. అయితే ఆ పార్టీ నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత ఏర్పడడం విశేషం.
తిరుమలలో హాట్ కామెంట్స్..
తాజాగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చారు తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు పాలనను కొనియాడారు. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. నాడు తెలంగాణకు భారీగా పెట్టుబడులు తేవడంలో కేటీఆర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తే.. ఇప్పుడు చంద్రబాబుతో పాటు లోకేష్ సైతం భారీగా పెట్టుబడులు తీస్తున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి లక్ష కోట్లు ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అయితే సహజంగానే
బిఆర్ఎస్ మాజీ మంత్రి కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే కెసిఆర్ పార్టీ చంద్రబాబును ఎంత ద్వేషించినా.. మల్లారెడ్డి గతంలో కూడా చంద్రబాబు విషయంలో సానుకూల వ్యాఖ్యానాలే చేశారు.
పూర్వాశ్రమం టిడిపి..
పూర్వాశ్రమంలో మల్లారెడ్డి టిడిపికి చెందిన నేత. ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. విద్యా సంస్థల అధినేతగా ఉన్న మల్లారెడ్డిని గుర్తించి మరి చంద్రబాబు రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి కేసీఆర్ గూటికి వెళ్లారు. అయితే గులాబీ దళంలో చేరినా.. పొలిటికల్ గాడ్ ఫాదర్ చంద్రబాబు విషయంలో మాత్రం చాలా కృతజ్ఞతా భావంతోనే ఉంటారు. అయితే తెలంగాణ ఎన్నికల అనంతరం మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని తెగ ప్రచారం నడిచింది. అదే సమయంలో బిజెపిలోకి వెళ్తారని కూడా టాక్ నడిచింది. చివరకు మాతృ పార్టీ టిడిపి వైపు కూడా వస్తారని హడావిడి నడిచింది. చివరకు బిఆర్ఎస్ లోనే కొనసాగుతూ వచ్చారు మల్లారెడ్డి. ఆ పార్టీ మాజీ మంత్రి గానే ఇప్పుడు చంద్రబాబు పాలనను పొగిడారు. అయితే మల్లారెడ్డి వరకు ఓకే కానీ.. గులాబీ పార్టీ మాజీమంత్రిగా ఆయన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఆశ్చర్యకరమే.