CM Chandrababu: కూటమి శ్రేణుల ఆశలపై సీఎం చంద్రబాబు ( CM Chandrababu)నీళ్లు చల్లారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పట్లో లేవని తేల్చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని అంతా భావించారు. కానీ కొద్ది నెలల పాటు నాన్చుతూ వచ్చారు. తరువాత తొలి జాబితాను అతి కొద్ది మందితో ప్రకటించారు. అటు నెలలు గడిచిన తర్వాత రెండో జాబితాను విడుదల చేశారు. మొత్తం ఒక 100 పదవుల వరకు భర్తీ చేశారు. దీంతో మిగతా పదవుల కోసం నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడు పార్టీల నేతలకు పడిగాపులు తప్పడం లేదు. అయితే తాజాగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. జూన్లోగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే మరో ఐదు నెలల పాటు ఆశావహులు ఆగాల్సిందే.
* మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీలకు( market committees ) ఇంతవరకు పాలకవర్గాలను నియమించలేదు. ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంటుంది. పెద్ద నియోజకవర్గాలు అయితే రెండు చొప్పున ఉంటాయి. నామినేటెడ్ పదవుల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా ఆ పోస్టులు ఆశిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి కార్యకలాపాలతో పాటు గోదాముల అద్దెలతోపాటు పన్నుల వసూల రూపంలో ఆదాయం వస్తుంది. అందుకే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టుల కోసం నేతల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిని జూన్ లోగా భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే వీటికి అధికారులతో పర్సన్ ఇన్చార్జిలను కూడా నియమించారు.
* దేవస్థానాలకు సంబంధించి..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు( temples ) సంబంధించి ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డును నియమించారు. కానీ కీలకమైన దేవస్థానాలు కూడా ఉన్నాయి. వాటికి సైతం ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1100 ట్రస్ట్ బోర్డులకు నియామకాలు చేపట్టాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ పదవుల పంపకాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం రావాల్సి ఉంది. తొలి రెండు జాబితాలపై చాలావరకు అసంతృప్తులు బయటపడ్డాయి. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నారు. అటు బిజెపి నుంచి సైతం చాలామంది ఆశావహులు ఉన్నారు. వారంతా మెయిన్ పదవులు ఆశిస్తున్నారు. దీంతో కొన్ని పదవుల విషయంలో స్తబ్దత కొనసాగుతోంది. అందుకే జూన్ వరకు గడువు విధించినట్లు తెలుస్తోంది.
* ఎమ్మెల్సీలు రాజ్యసభ తో పాటు
నామినేటెడ్ పదవులతో( nominated posts ) పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. వైసిపి కి రాజీనామా తో పాటు చాలామంది పదవులు వదులుకుంటున్నారు. అలాగే మార్చిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందినవారు పదవీ విరమణ చేస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. అలాగే రాజ్యసభకు సంబంధించి కూడా చాలా పోస్టులు భర్తీ కావాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఒకేసారి పదవుల పంపకం చేపట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. మూడు పార్టీల్లో ఎక్కడా అసంతృప్తులు రాకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అయితే మరి కొద్ది రోజుల్లో నామినేటెడ్ పదవుల జాబితా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ వారి ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు.