Botsa Satyanarayana : ఏపీలో ఎన్నికలవేళ రకరకాల ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా సంచలనాలకు వేదిక అవుతోంది. కౌంటింగ్ కు రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల్లో ఒక రకమైన ధీమా కనిపిస్తోంది. అయితే కూటమి పార్టీలతో పోల్చితే వైసీపీలో భిన్న వాతావరణం ఉంది. ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారంటూ ఒక ప్రచారం ప్రారంభమైంది. నేరుగా అధినేత జగన్ కు రాజీనామా పత్రం రాసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసిపి కి ఘోర ఓటమికి మీ విధానాలే కారణం అంటూ తప్పుపడుతూ.. బొత్స ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది.
గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు బొత్స. 2014 ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడిగా ఉండిపోయారు బొత్స సత్యనారాయణ. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువగా వైసీపీలో చేరారు. మిగతావారు తెలుగుదేశం పార్టీలో చేరారు. బొత్స సత్యనారాయణ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు. ఆ పార్టీ అభ్యర్థులుగానే పోటీ చేశారు. గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో బొత్స ప్రభావం విజయనగరం పై పడటంతో వైసీపీ మూడో స్థానానికి వెళ్లిపోయింది. దీంతో జగన్ గత ఎన్నికలకు ముందు బొత్స కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో బొత్సకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్లీన్ స్లీప్ చేశారు బొత్స. జగన్ ఎంతో నమ్మకంతో బొత్సను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. విస్తరణలో సైతం కొనసాగింపు ఇచ్చారు. ప్రభుత్వ, పార్టీ విధానాల్లో ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబంలో నలుగురికి టికెట్లు లభించాయి. చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేస్తుండగా, గజపతినగరం నుంచి తమ్ముడు అప్పల నరసయ్య, నెల్లిమర్ల నుంచి సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు, విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి సతీమణి ఝాన్సీ లక్ష్మికి జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు కూటమికి పరిస్థితి అనుకూలంగా ఉంటుందని ఒక అంచనా ఉంది. కానీ విజయనగరం జిల్లాకు వచ్చేసరికి బొత్స కుటుంబానిదే ఆధిపత్యం అని చాలా సర్వేలు తేల్చినట్లు వార్తలు వచ్చాయి. అటు పోలింగ్కు ముందు, పోలింగ్ తర్వాత బొత్సకు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. పోలింగ్ తర్వాత బొత్స కీలక ప్రకటన కూడా చేశారు. జూన్ 9న విశాఖ నగరంలో జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఫలితాలు వచ్చిన మరుక్షణం అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో బొత్స వైసీపీకి రాజీనామా చేశారని ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. గత ఐదు సంవత్సరాలుగా జగన్ విధ్వంసకర పాలనతో ప్రజలు తిరస్కరించారని.. ఘోర ఓటమికి జగనే కారణమంటూ.. ప్రత్యేకంగా రాజీనామా లేఖ రాసినట్లుసోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. అయితే అది ఫేక్ లెటర్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మంత్రి బొత్స స్పందించే అవకాశం ఉంది.
