AP BJP: టికెట్లు ఆశిస్తున్న ఆశావహులతో భారతీయ జనతా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టిడిపి, జనసేనతో పొత్తులో భాగంగా బిజెపికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థుల ఎంపికపై బిజెపి హై కమాండ్ దృష్టి పెట్టింది. బలమైన అభ్యర్థులను బరిలోదించాలని చూస్తోంది. అయితే ఒక్కో టికెట్ కు ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. మరోవైపు పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య విపరీతమైన పోటీ ఉంది. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు పావులు కదుపుతున్నారు.
మరోవైపు పది అసెంబ్లీ స్థానాలకు గాను 9 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నేడు అధికారికంగా జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బిజెపి నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మనకు ఏ సీటు ఖరారు అయింది? ఎవరు పోటీలో ఉంటారు? అన్న అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. రాయలసీమలో ఆదోని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు.. కోస్తాలో విజయవాడ పశ్చిమ, కైకలూరు, అనపర్తి/పి. గన్నవరం.. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పాడేరు, విశాఖ ఉత్తరంఖరారయ్యే ఛాన్స్ ఉంది. అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
అభ్యర్థులకు సంబంధించి ధర్మవరం నుంచి వరదాపురం సూరి, ఆదోనిలో డాక్టర్ పార్థసారథి, జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు వినిపిస్తోంది. బద్వేలులో గతంలో పోటీ చేసిన జ్యోతి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఓ కీలక నేత ఆశీస్సులు ఆమెకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఖరారయ్యే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ నుంచి జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, నగర మాజీ అధ్యక్షుడు జబ్బురి శ్రీరామ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పాడేరు నుంచి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. ఇక శ్రీకాకుళం నుంచి బీసీ వర్గానికి చెందిన పైడి వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిజెపికి అనపర్తి ఇచ్చేందుకు టిడిపి సిద్ధమైనా.. పి. గన్నవరం వైపే ఆ పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ సీటు దక్కితే మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాను బరిలో దించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు సీట్ల విషయంలో బిజెపి ఎటూ తేల్చుకోవడం లేదు. దాదాపు అభ్యర్థుల కసరత్తు పూర్తి కావడంతో ఈరోజు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.