Union budget 2024 : గతంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారంటే సింహ భాగం కేటాయింపులు ఉత్తరాధి రాష్ట్రాలకే. అది కూడా బిజెపి పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఈసారి బడ్జెట్లో మాత్రం ఇతర ప్రాంతాలకు సైతం కేటాయింపులు చేశారు. మునుపటిలా ఏకపక్షంగా బిజెపి పాలిత రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తామంటే కుదరదు. అందుకు వీలు లేదు కూడా. గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. ఈసారి మాత్రం మిత్రుల సాయం అనివార్యంగా మారింది. అదే మిత్రులకు న్యాయం చేయాల్సి కూడా వచ్చింది.
* ఈ రెండు పార్టీలే కీలకం
2024 ఎన్నికల్లో సొంతంగా 300 స్థానాల్లో అధికారంలోకి రావాలన్నది బిజెపి లక్ష్యం. ఎన్డీఏ పరంగా 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకోండి.కానీ బిజెపి కేవలం 244 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ సాధించిన 16 స్థానాలు, నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయు సాధించిన 12 ఎంపీ సీట్లు కీలకంగా మారాయి. ఆ రెండు పార్టీలు లేనిదే.. కేంద్రంలో బిజెపి అధికారం నిలుపుకోవడం అసాధ్యం. బిజెపితో జతకట్టేందుకు మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం ముందుకు రాని పరిస్థితి. అందుకే అటు చంద్రబాబుతో పాటు ఇటు నితీష్ ను సంతృప్తి పరచగలిగింది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్లో ఏపీతో పాటు బీహార్ కు ప్రాధాన్యం ఇచ్చింది.
* రెండుసార్లు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు
జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న చంద్రబాబు సర్కార్ కొలువుదీరింది. మొత్తం నాలుగు సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అందులో రెండుసార్లు బడ్జెట్ ప్రతిపాదనలతోనే ఢిల్లీలో అడుగుపెట్టారు. అమరావతికి తక్షణసాయంగా 25 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు30 వేల కోట్లు అవసరమని కేంద్ర పెద్దల ముందు ప్రతిపాదన పెట్టారు. ఇదే విషయంపై కూటమి ఎంపీలు సైతం మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే చంద్రబాబు ఆశించినంత కాకున్నా.. తాజా బడ్జెట్లో అమరావతికి 15000 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం. పోలవరం విషయంలో సైతం తప్పకుండా సాయం చేస్తామని ప్రకటించింది. అంకెలు మాత్రం వెల్లడించలేదు.
* ఈసారి వెనుకబడిన జిల్లాలకు కూడా
వెనుకబడిన జిల్లాలకు సంబంధించి నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే ఎంత మొత్తంలో కేటాయిస్తారని మాత్రం చెప్పలేదు. గతంలో 750 కోట్లు వరకు సాయం చేశారు. దీనిని మినహాయించుకుని మిగతా మొత్తం సాయం చేసే అవకాశం ఉంది. వైసిపి ప్రభుత్వ హయాంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపులు నిలిచిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ జిల్లాలకు ఇది మైనస్. ఏటా వెనుకబడిన జిల్లాల నిధులు వచ్చేవి. రహదారులతో పాటు కీలక నిర్మాణాలు జరిగేవి.జగన్ హయాంలో నిధులు లేక నిర్మాణాలు జరగలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు వెనుకబడిన నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. ఇది ఏపీకి ఉపశమనం ఇచ్చే విషయం. ఒక్కమాటలో చెప్పాలంటే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాత.. ఇంత కేటాయింపులు ఎప్పుడు జరగకపోవడం విశేషం.
* బీహార్ కు భారీ కేటాయింపులు
అయితే బీహార్ తో పోల్చుకుంటే ఏపీకి కేటాయింపులు తక్కువే. కేవలం అమరావతి రాజధాని నిర్మాణానికి మాత్రమే 15 వేల కోట్ల రూపాయలు అందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. పోలవరం విషయంలో నిర్దిష్టమైన అంకెలు వెల్లడించలేదు. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కూడా నిధుల కేటాయింపు పై స్పష్టత లేదు. సర్వోదయ ప్రాజెక్టుల కింద చేపడుతున్న పనులకు సంబంధించి కూడా.. నిర్దిష్టమైన నిధుల ప్రకటన లేదు. కానీ బీహార్ విషయంలో మాత్రం కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. కేవలం అక్కడ రహదారుల అభివృద్ధికి 26 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. మరో 21 వేల కోట్లతో వివిధ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. పర్యాటకంగా కూడా చాలా రకాల కేటాయింపులు చేసింది. అయితే ఏపీ కంటే బీహార్ కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఏపీకి ఈ స్థాయిలో బడ్జెట్లో నిధులు లేకున్నా.. బీహార్ తో పోల్చుకుంటే మాత్రం తక్కువే.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Bihar has higher allocation than ap in budget 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com