Pawan Kalyan And Chandrababu
Pawan Kalyan And Chandrababu: బిజెపి కోసం జనసేన మూడు మెట్లు దిగగా.. టిడిపి ఒక మెట్టు దిగింది. కానీ బిజెపి పట్టు వీడకుండా తాను అనుకున్నది సాధించింది. ఎల్లో మీడియా ద్వారా బిజెపికి తక్కువ స్థానాలు ఇవ్వచూపేందుకు చంద్రబాబు ప్రయత్నించినా.. అవేవీ ఫలించలేదు. పొత్తుల కోసం ఢిల్లీలో చర్చలు ప్రారంభమైనప్పుడే నిర్దిష్టమైన సీట్లను బిజెపి అగ్రనేతలు ప్రతిపాదించారు. వాటి విషయంలో మెట్టు దిగలేదు. టిడిపి, జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ త్యాగంలో కూడా సింహభాగం జనసేనదే. మొత్తానికైతే ఒక మెట్టు దిగి బిజెపిని ఒప్పించారు. పొత్తు కుదుర్చుకున్నారు.
గత నెలలో చంద్రబాబుతో పాటు పవన్ సైతం బిజెపి అగ్ర నేతలను కలిశారు. ఆ సమయంలో చాలా ఎక్కువ సీట్లనే బిజెపి అడిగినట్లు ప్రచారం జరిగింది. అబ్బబ్బె అటువంటిదేమీ లేదు.. తమకున్న బలం మేరకే బిజెపి సీట్లు అడుగుతుందని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు పార్లమెంట్ స్థానాలను ఇచ్చేందుకు టిడిపి అంగీకరించినట్లు కథనాలు రాసుకొచ్చింది. బిజెపి, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 వరకు పార్లమెంట్ స్థానాలను కేటాయిస్తామని చెప్పుకొచ్చారు. అందులోనే రెండు పార్టీలు సర్దుకోవాలని చంద్రబాబు సూచించారు. అప్పటికే 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలను జనసేనకు కేటాయించడంతో.. బిజెపికి ఆరు అసెంబ్లీ, ఐదు పార్లమెంట్ స్థానాలు మిగులుతాయని ప్రచారం జరిగింది.
అయితే చంద్రబాబు నివాసంలో నిన్న జరిగిన పొత్తు చర్చలో అసలు విషయం బయటపడింది. ఆది నుంచి పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలు ఇవ్వాల్సిందేనని బిజెపి పట్టుబడినట్లు సమాచారం. నిన్నటికి తేలింది కూడా అదే. చంద్రబాబు సైతం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. ఆ రెండు పార్టీలకు ఒక్క అసెంబ్లీ స్థానం అదనంగా కేటాయించాల్సి వచ్చింది. 31 సీట్లు ఇవ్వాల్సి వచ్చింది. అటు పవన్ సైతం బిజెపి కోసం తనకు కేటాయించిన మూడు పార్లమెంటు స్థానాల్లో ఒకదాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు మూడింటిని త్యాగం చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే పవన్ పొత్తుల కోసం భారీ త్యాగానికి సిద్ధపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ఒక్క అసెంబ్లీ సీటును వదులుకొని.. బిజెపితో పొత్తు పెట్టుకోగలిగారు.