Daggubati Purandeswari: బావ చంద్రబాబు పాలి‘ట్రిక్స్’.. పాపం పురంధేశ్వరి.!

చంద్రబాబుతో గతంలో పురందేశ్వరి కి రాజకీయ వైరుధ్యాలు ఉండేవి. చంద్రబాబును విభేదించి దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పురందేశ్వరి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Written By: Dharma, Updated On : March 12, 2024 10:02 am

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: నిన్నటి పొత్తుల చర్చకు పురందేశ్వరి ఎందుకు రాలేదు? పొత్తులపై ఆమె అసంతృప్తిగా ఉన్నారా? లేకుంటే తాను ఆశించిన విశాఖ ఎంపీ సీటు దక్కలేదా? లేకుంటే బిజెపి అగ్రనాయకత్వం పిలవలేదా? అసలేం జరిగింది? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. నిన్న చంద్రబాబు నివాసంలో బీజేపీ అగ్ర నేతలు, పవన్, చంద్రబాబు పొత్తులపై చర్చించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశంలో పురందేశ్వరి ఎక్కడా కనిపించకపోవడం విశేషం. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, టిడిపి సీనియర్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తదితరులు కనిపించారు. బిజెపి రాష్ట్ర శాఖ నుంచి ఒక్క నాయకుడు కూడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబుతో గతంలో పురందేశ్వరి కి రాజకీయ వైరుధ్యాలు ఉండేవి. చంద్రబాబును విభేదించి దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పురందేశ్వరి ఎంపీ అయ్యారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేక స్వరం వినిపించేవారు. అయితే గత కొద్ది రోజులుగా పరిస్థితి మారింది. వైసిపి సర్కార్ ఎన్టీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడంతో.. పాత పరిస్థితులన్నీ మరిచిపోయి చంద్రబాబుతో పురందేశ్వరి కుటుంబీకులు కలిసిపోయినట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే పరిస్థితి ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పురందేశ్వరి కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. అటు తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకించలేదు. అటువంటి ఆమె ఇప్పుడు పొత్తుల చర్చల్లో కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

నిన్న చంద్రబాబు ఇంటికి బిజెపి జాతీయ నాయకులు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,మరో ఎంపీ బై జయంత్ పాండా హాజరయ్యారు. కానీ బిజెపి రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి మాత్రం హాజరు కాలేదు. ఆమె హాజరు కాకపోవడానికి ఎటువంటి అధికారిక ప్రకటన కూడా లేదు. ఎంపీగా పోటీ చేసి కేంద్రమంత్రి కావాలని పురందేశ్వరి భావిస్తున్నారు. ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె విశాఖ కోరుతున్నట్లు సమాచారం. అయితే అందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. 24 సంవత్సరాలుగా విశాఖ ఎంపీ సీటును వదులుకున్నామని.. ఈసారి వదులుకునే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే పురందేశ్వరి అలిగి గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టిడిపి కోసం ఆమె బిజెపిలో పని చేస్తున్నారన్న ప్రచారం ఉంది. టిడిపికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని కూడా టాక్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్తే అవన్నీ నిజమవుతాయని ఆమె భావించినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ పొత్తుల వ్యవహారంలో రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదని చెప్పడానికి కూడా ఆమె గైర్హాజరై ఉంటారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే పొత్తుల చర్చలు పురందేశ్వరి కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.