Big Alert for Telugu states : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో రికార్డ్ స్థాయిలో వర్షాలు నమోదు అవుతున్నాయి. విజయవాడ, గుంటూరులో వర్షం తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే ఆ రెండు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. గత ఐదు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా 175 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. విజయవాడలో శివారు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి.సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. మరోవైపు కృష్ణా నదిలో నీటి ఉధృతి అధికంగా ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీకి ఉన్న 72 గేట్లను యధాతధంగా ఎత్తివేసి కిందకు నీటిని విడిచి పెడుతున్నారు. విజయవాడ నగరంలోని నది పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఇంద్రకీలాద్రి మార్గంలోని ఘాట్ రోడ్లను మూసివేశారు. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న పలు రైళ్ల సర్వీసులను సైతం రద్దు చేశారు.
* సెలవు ఇవ్వాల్సిందే
ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే వర్షాలతో తొమ్మిది మంది మృత్యువాత పడటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వర్షాలు, ఉధృతి కారణంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆదేశాలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు భారీ వర్షాలతో అతలాకుతలమైన జిల్లాల్లో సహాయ చర్యల కోసం మూడు కోట్ల రూపాయల చొప్పున విడుదల చేశారు. వరదలతో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
* తుఫాన్ తీరం దాటినా
ఇప్పటికే తుఫాన్ తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటిన తుఫాన్.. తరువాత నిర్వీర్యమైంది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. గుంటూరు, కృష్ణా జిల్లాలో వర్షాల తీవ్రత అధికంగా ఉంది. రేపు కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. స్పష్టమైన హెచ్చరికలు పంపింది.
* తెలంగాణలో
మరోవైపు తెలంగాణలో సైతం వర్ష తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని జిల్లాల అధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు తరగతులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు.