Bhooma Akhilapriya : ఏపీలో వివాదాస్పద నేతల్లో భూమా అఖిలప్రియ ఒకరు. తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అఖిలప్రియ. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసులతో పాటు కొన్ని రకాల ఆరోపణలు సైతం ఆమెపై వచ్చాయి. తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె ప్రత్యర్థులకు స్ట్రాంగ్ హెచ్చరిక చేశారు. ఓ 100 మంది తన నుంచి ఇబ్బంది పడేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన అఖిలప్రియ ఓడిపోయారు. అప్పటినుంచి అధికారపక్షం ఆమెను వెంటాడింది. కేసుల మీద కేసులు పెట్టింది. అరెస్టు చేసి జైలుకు కూడా పంపింది. చివరకు ఆమెకు టిక్కెట్ రాదని కూడా ప్రత్యర్థులు ప్రచారం చేశారు. వాటన్నింటికి బ్రేక్ చెబుతూ టిడిపి హై కమాండ్ అఖిలప్రియకు ఆళ్లగడ్డ టికెట్ ఇచ్చింది. ఆమె భారీ మెజారిటీతో గెలుపొందారు. మంత్రి పదవిని ఆశించారు. కానీ వివిధ సమీకరణల్లో ఆమెకు దక్కలేదు. అయితే తనను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని విడిచి పెట్టనని అఖిల ప్రియ హెచ్చరిస్తున్నారు.
* ఆ వంద మందిని వదలరట
ఇటీవల అఖిల ప్రియ మీడియాతో మాట్లాడారు. తనకు ఎదురైన పరిణామాలను వివరించారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. ఓ 100 మంది తనను ఇబ్బంది పెట్టిన వారి జాబితాలో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారందరిపై రివెంజ్ తప్పదని స్పష్టం చేశారు. అయితే నేరుగా దాడులు ఉండవని, కక్షపూరిత కేసులు కావని కూడా ఆమె తేల్చారు. వారు తప్పు చేసినట్టు పూర్తి ఆధారాలు చూపించి చర్యలకు ఉపక్రమిస్తామని భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సొంత పార్టీ శ్రేణులతో పాటు వైసీపీ అభిమానులు సైతం ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్లు పెడుతున్నారు.
* నాయకత్వం హెచ్చరించినా
భూమా అఖిల ప్రియ దూకుడుకు చంద్రబాబు పలుమార్లు కళ్లెం వేసినట్లు ప్రచారం జరిగింది. దూకుడు తగ్గించుకోకపోతే చర్యలు తప్పవని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ఆమెకు రాదని కూడాటాక్ నడిచింది. అయితే గతంలో భూమా కుటుంబం ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిందో చంద్రబాబుకు తెలుసు. అందుకే మరోసారి భూమా అఖిలప్రియ కు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అన్ని విధాలా ప్రోత్సహించారు. స్వయంగా ఆళ్లగడ్డ వెళ్లి ఆమెకు మద్దతుగా ప్రచారం చేశారు.అయితే దూకుడు తగ్గించాలని చంద్రబాబు పలుమార్లు ఆమెకు సూచించారు. కానీ ఆమె పెడచెవిన పెడుతూనే ఉన్నారు.
* తల్లిదండ్రుల మరణంతో
2014 ఎన్నికలవేళ శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అటు తరువాత అస్వస్థతకు గురైన భూమా నాగిరెడ్డి సైతం కన్నుమూశారు. తల్లిదండ్రుల అనుహ్య మరణాలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అఖిల ప్రియ. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వెంటనే చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే రాజకీయ ఆధిక్యం కోసం తరచూ ఆమె ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. అయితే తాజాగా లోకేష్ కు ఫాలో అవుతున్నట్లు కనిపించారు. తాను రెడ్బుక్ రాశానని.. అందులో 100 మంది వరకు పేర్లు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఆది నుంచి ఇదే దూకుడుతో కొనసాగుతున్నారు. అదే ఆమెకు ఇబ్బంది కరం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Bhuma akhilapriya says that she will not let go of those hundred people who have troubled me
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com