Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరోవైపు ప్రారంభోత్సవం సందర్భంగా విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వారందరికీ ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. మరోవైపు విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందరిని ఆకట్టుకునేలా తెలుగులో ఉత్తమ స్లోగన్ ను రూపొందించాలని పిలుపునిచ్చారు. మంచి స్లోగన్ పంపిన విద్యార్థులకు లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తామని తెలిపారు.
* ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు..
అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా కూడా గుర్తింపు సాధించనుంది. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక స్లోగన్ రూపొందించి అందిస్తే.. ఉత్తమ స్లోగన్ కు లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
* ఈ అంశాలపై..
ప్రధానంగా ఈ స్లోగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పై విమానాశ్రయ ప్రభావం ఎలా ఉంటుంది, ఆశయాలు, ప్రత్యేకతలు వివరించేలా ఈ స్లోగన్ ఉండాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి సూచించారు. ఆరు నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులంతా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఈనెల 25 సాయంత్రం ఐదు గంటల్లోగా స్లోగన్, పేరు, చదువు, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటి వివరాలను వాట్సాప్ నంబర్ 9440749687 కానీ.. airportsloga@gmail.com కి కానీ పంపించాలన్నారు. ఒక్క దానికి మాత్రమే బహుమతి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే స్లోగన్ పంపించాలని సూచించారు. మరోవైపు విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా సమీక్షలు జరుగుతున్నాయి. ప్రధానంగా జన సమీకరణ, ఆహారం, పార్కింగ్, రవాణా వంటి ఆర్పాట్లపై చర్చించారు. మరోవైపు ఆగస్టు 1న విమానాశ్రయ ప్రారంభం నేపథ్యంలో.. ముందు రోజు పింఛన్ల పంపిణీ జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.







