DSP Jayasurya: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో 10 రోజుల క్రితం ప్రముఖంగా వినిపించిన పేరు డి.ఎస్.పి జయ సూర్య. భీమవరం డిఎస్పీగా ఉన్న జయ సూర్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పేకాట శిబిరాల నిర్వహణతో పాటు సివిల్ తగాదాల్లో వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో నేరుగా మాట్లాడారు. నివేదిక కోరారు. డిజిపి కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చారు. హోంమంత్రిత్వ శాఖకు తన కార్యాలయం నుంచి ప్రత్యేకంగా నివేదించారు. దీంతో ఏపీవ్యాప్తంగా డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎంతలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు డిఎస్పి జయసూర్య ట్రాక్ రికార్డ్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. మంచి అధికారిగా కితాబిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం స్పందిస్తూ.. భీమవరం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను పవన్ కళ్యాణ్ కు వివరిస్తానని చెప్పారు. అయితే ఇంతలో తుఫాన్ నేపథ్యంలో ఈ అంశం మరుగున పడిపోయింది.
Also Read: పవన్ స్టైల్ మారింది.. ఏంటీ కొత్త సంకేతం?
* అవార్డు ప్రకటించిన కేంద్రం..
తాజాగా కేంద్ర ప్రభుత్వం( central government) గృహ మంత్రి దక్షత పతకాలను ప్రకటించింది. ఏపీ నుంచి నలుగురు పోలీస్ అధికారులను ఎంపిక చేయగా అందులో భీమవరం డిఎస్పి జయసూర్య ఒకరు. గతంలో ఓ కేసు పురోగతిలో కీలకపాత్ర పోషించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అయితే సమర్థత కలిగిన అధికారిగా జయసూర్యకు మంచి పేరు ఉంది. వైసిపి ప్రభుత్వ హయాంలో గన్నవరం డిఎస్పీగా సేవలందించారు. బదిలీల్లో భాగంగా భీమవరం వచ్చారు. అయితే ఆయన పేకాట శిబిరాల నిర్వహణతో పాటు సివిల్ తగాదాల్లో వేలు దూర్చుతున్నారన్నది ఆయనపై పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఫిర్యాదు. అందుకే పవన్ కళ్యాణ్ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదికను కోరారు. కానీ ఇప్పుడు అదే అధికారికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం కొత్త మలుపుకు దారి తీసినట్లు అయింది.
* ప్రభుత్వం సీరియస్..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) డీఎస్పీ పై స్పందించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై సీరియస్ యాక్షన్ లోకి దిగింది. హోంమంత్రి వంగలపూడి అనితకు విలేకరుల నుంచి ఒక ప్రశ్న ఎదురయింది. హోం శాఖ పై పవన్ కళ్యాణ్ పెత్తనం ఏంటని విలేకరులు ప్రశ్నించేసరికి వంగలపూడి అనిత వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ శాఖలో ఉన్న లోపాలపై మంత్రులు మాట్లాడవచ్చని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవంగా తమ శాఖకు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చారు. కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించవద్దని కూడా హెచ్చరించారు. అయితే ఇంత జరిగాక ఆ నివేదిక ఏమైంది? డీఎస్పీ జయ సూర్య పై నివేదిక ఇచ్చారా? ఇస్తే ఏమిచ్చారు? అన్నది సస్పెన్స్ గా మారింది. ఇంతలోనే రాష్ట్రంలో భారీ తుఫాను వచ్చింది. అది మరువక ముందే ఇప్పుడు అదే డి.ఎస్.పి కి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది.
* ఫిర్యాదు ఎవరు చేశారు?
అయితే పవన్ కళ్యాణ్ కు ఎవరు ఫిర్యాదు చేశారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తప్పుడు ఫిర్యాదులతోనే పవన్ అలా స్పందించారా? దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఎవరికి వారే తాము ఫిర్యాదు చేయలేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందా? అందుకే ఆయన సైలెంట్ అయ్యారా? అన్నది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ డిఎస్పి రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఇన్ని ఆరోపణలు వచ్చిన తరువాత కూడా ఆయనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడంతో ఇది సరికొత్త చర్చకు దారితీసింది.