BYCP in YCP coalition news: రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ స్థితిలో ఉంటారో చెప్పలేము. ఎందుకంటే ఒకసారి ఓటమి ఎదురవుతుంది. మరోసారి గెలుపు తలుపు తడుతుంది. అయితే రాజకీయ అవసరాలు కూడా అంతే. ఎవరితో ఏ అవసరం వస్తుందో చెప్పలేం కూడా. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి. ప్రత్యర్థి పార్టీలను ఓ రేంజ్ లో వేసుకోవడం వైసీపీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అయితే ఈ విషయంలో జనసేన కూడా బాధితురాలు. ఎందుకంటే జనసేన ను టార్గెట్ చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రచారం అంటూ లేదు. మొన్న జనసేన సంపూర్ణ విజయం, వైయస్సార్ కాంగ్రెస్ దారుణ ఓటమితో ఈ ప్రచారం కొట్టుకెళ్లిపోయింది. కానీ ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత చైతన్య యువజన పార్టీ.. అలియాస్ బిసివై పార్టీపై ఆధారపడుతోందన్న టాక్ ప్రారంభం అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతుండడం కొత్త రాజకీయ పరిణామం.
బీసీవై పార్టీ ఏర్పాటు..
చిత్తూరు జిల్లాకు చెందిన బోడె రామచంద్ర యాదవ్( Ramachandra Yadav) భారత యువజన చైతన్య పార్టీని ఏర్పాటు చేశారు. బడుగులకు రాజ్యాధికారం అన్న నినాదంతో ఈ పార్టీని స్థాపించారు. పారిశ్రామికవేత్త అయిన బోడే రామచంద్ర యాదవ్ కు కేంద్రంలో మంచి పట్టు ఉంది. 2019 ఎన్నికల కు ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి జనసేన తరఫున పుంగనూరు నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయింది. కనీసం డిపాజిట్లు రాలేదు. అయితే తరువాత భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీసీవై పార్టీని టార్గెట్ చేశారు. పలుమార్లు బోడే రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి కూడా జరిగింది. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు బీసీవై పార్టీ వెనుక ఉన్నారనేది అప్పట్లో ఒక విమర్శ.
క్రమేపీ వైసీపీకి అనుకూలం..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( peddi Reddy Ramachandra Reddy ) అయితే బోడె రామచంద్ర యాదవ్ పై ఓ రేంజ్ లో విరుచుకు పడేవారు. ఆయన పేరును ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. పూజకు పనికిరాని పువ్వు అని సంబోధించేవారు. గతంలో బోడె రామచంద్ర యాదవ్ పై దాడి జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖండించారు. ఒక సాధారణ నేతగా ఉన్న బోడె రామచంద్ర యాదవ్ విషయంలో ప్రతిపక్ష నేత స్పందించడం అప్పట్లో ఒక సంచలనమే. కనీసం బీసీవై పార్టీ ఒక పార్టీయేనా అని వ్యాఖ్యానించేవారు వైసీపీ సామాన్య కార్యకర్తలు.. కానీ ఇటీవల ఎందుకో బోడె రామచంద్ర యాదవ్ రూట్ మారింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి కట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే బీసీవై పార్టీని కూటమి ప్రభుత్వంపై ఉసిగొల్పుతున్నారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..