Rajya Sabha Elections: జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీది ప్రత్యేక స్థానం. నాలుగు దశాబ్దాల ఆ పార్టీ ఎన్నో గెలుపోటములన చూసింది. తడబడి నిలబడింది. కానీ ఉనికి చాటుకుంది. అయితే ఇప్పుడు అదే పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కానుంది. రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. ప్రస్తుతం టిడిపికి రాజ్యసభలో కనకమెడల రవీంద్ర సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవి ఏప్రిల్ 2 తో ముగియనుంది. ఏపీలో జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో.. ఆయన ఖాళీ చేస్తున్న ఒక్క స్థానం ఉండడం విశేషం. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ దూకుడుగా ఉంది. ఆ మూడు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు.
అసలు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో బరిలో దిగుతుందా? లేదా? ఆ పార్టీ వ్యూహం ఏమిటి? అన్నది తెలియడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు పొత్తుల అంశంతో బిజీగా ఉన్నారు. సీట్ల సర్దుబాటు పై దృష్టిపెట్టారు. కీలక చర్చలు జరుపుతున్నారు. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే రాజ్యసభ ఎన్నికలు రావడంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యసభ పదవి దక్కించుకోవాలంటే 44 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఈ లెక్కన మరో 26 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. వైసీపీలో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు టిడిపి వైపు వస్తారని చంద్రబాబు భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రావడం లేదు. మరోవైపు ప్రజల్లోకి తప్పుడు భావన వెళ్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలే ప్రధానమన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే రాజ్యసభ ఎన్నికలకు చాలా రోజుల కిందట నుండి టిడిపి ప్రత్యేక వ్యూహం పన్నింది. వర్ల రామయ్య తో పాటు కోనేరు సతీష్ పేరు వినిపించింది. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అనూహ్య విజయం దక్కించుకుంది. ఇప్పుడు కూడా రాజ్యసభ ఎన్నికల్లో అదే మాదిరిగా పావులు కదపవచ్చని భావించింది. కానీ రాజ్యసభ ఎన్నికలకు కావలసిన సంఖ్యా బలానికి టిడిపి చాలా దూరంగా ఉంది. 44 మంది ఎమ్మెల్యేల మద్దతు దక్కించుకోవాలంటే చాలా రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ముంగిట ప్రలోభ పెట్టి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భయపడుతున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని దక్కించుకుంటామని టిడిపి నేతలు ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించలేకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదేనా మీ ప్రతాపం, ప్రగల్బాలు అంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. మొత్తానికైతే నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ.. తొలిసారిగా రాజ్యసభ ప్రాతినిధ్యం లేకుండా ఉండడానికి సిద్ధపడటం గమనార్హం.