Bay of Bengal Weather Alert: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన వచ్చింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. రుతుపవనాలు నెమ్మదించడం వల్లే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇకనుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
రుతుపవనాల రాకతో
ఈ ఏడాది ముందుగానే దేశానికి రుతుపవనాలు తాకాయి. వారం రోజుల ముందుగానే తాకడంతో మే నెలలో భారీ వర్షాలు పడ్డాయి. ఏపీకి సైతం ఎనిమిది రోజులు ముందుగానే రుతుపవనాలు రావడంతో ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. మే నెల కావడం.. వర్షాలు పడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే జూన్ మొదటి వారం నుంచి రుతుపవనాలు నెమ్మదించాయి. ఆశించిన స్థాయిలో విస్తరించలేదు. ఫలితంగా ఎండ తీవ్రత మళ్లీ మొదటికి వచ్చింది. 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత( summer effect ) కనిపించింది. వేడి గాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే నడి వేసవిని తలపించింది పరిస్థితి. అయితే ఇప్పుడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారాయి. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో ఉరుములు, పిడుగులు పడతాయి. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.
ఈ జిల్లాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో( Bay of Bengal) ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు గుంటూరు,బాపట్ల పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి,చిత్తూరు, కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు కావచ్చు.