Bandaru Satyanarayanamurthy: పొత్తులో భాగంగా చాలామంది సీనియర్లకు చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వలేకపోయారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజా, బండారు సత్యనారాయణమూర్తి, గుండ అప్పల సూర్యనారాయణ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇందులో చాలామంది సైలెంట్ అయ్యారు. అయిష్టంగానే హై కమాండ్ ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే ఇందులో బండారు సత్యనారాయణమూర్తి మాత్రం బేఖాతరు చేస్తున్నారు.అధినేతకు చికాకు పెడుతున్నారు. బండారు సత్యనారాయణమూర్తి టిడిపిలో సీనియర్. మూడు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. ఒకసారి మంత్రిగా కూడా వ్యవహరించారు.దీంతో ఈసారి పోటీకి ఛాన్స్ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
పరవాడ నియోజకవర్గ నుంచి వరుసగా బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందుతూ వచ్చారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో పరవాడ కనుమరుగయ్యింది. పెందుర్తి తెరపైకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గండి బాబ్జి బరిలో దిగారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున పంచకర్ల రమేష్ బాబు పోటీ చేశారు. త్రిముఖ పోటీలో పంచకర్ల రమేష్ బాబు గెలుపొందారు. అటు తరువాత 2014లో ఇదే పంచకర్ల రమేష్ బాబు టిడిపిలో చేరారు. కానీ పెందుర్తి సీటు దక్కించుకోలేకపోయారు. ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. బండారు సత్యనారాయణ పెందుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుంచి పెందుర్తిని తన సొంత సీటుగా బండారు సత్యనారాయణమూర్తి భావిస్తూ వచ్చారు.
అయితే ముందు చూపుతో వ్యవహరించిన పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. పెందుర్తి సీటుపై ఆశలు పెట్టుకునే ఆయన పావులు కదిపారు. వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా.. ఆ పదవిని వదులుకొని జనసేనలో చేరారు. అదే సమయంలో బండారు సత్యనారాయణమూర్తి సైతం అప్రమత్తమయ్యారు. టిడిపిలో బలమైన వాయిస్ వినిపించారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఈ దెబ్బతో తనకు పెందుర్తి టికెట్ ఖాయమని భావించారు. కానీ ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన సీటు కావడం, పంచకర్ల రమేష్ బాబుకు హామీ ఇవ్వడంతో ఆ సీటు కోసం పవన్ పట్టు పట్టారు. దీంతో చంద్రబాబు కూడా తలవంచాల్సి వచ్చింది. కానీ బండారు సత్యనారాయణమూర్తి మాత్రం తనకు ఎట్టి పరిస్థితుల్లో పెందుర్తి టికెట్ కావాల్సిందేనని పట్టుబట్టారు. కానీ చంద్రబాబు సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా సరే బండారు వినడం లేదు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే పంచకర్ల రమేష్ బాబును బండారు సత్యనారాయణమూర్తి చిరకాల ప్రత్యర్థిగా చూస్తున్నారు. 2009లో తనను దారుణంగా దెబ్బతీసిన పంచకర్ల రమేష్ బాబు.. ఈసారి గెలుపొందితే పెందుర్తిని తన సొంత నియోజకవర్గంగా మార్చుకుంటారని.. అదే జరిగితే తన కుమారుడి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళనతో ఉన్నారు. అందుకే పంచకర్ల రమేష్ బాబుకు సహకరించేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబుకు చికాకు పెడుతోంది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.