Balineni Srinivasa Reddy : బాలినేని vs వైవీ.. అదే వీరిద్దరి వైరానికి కారణం

ఇక వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య నెలకొన్న వైరాన్ని క్యాష్ చేసుకొనే పనిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. బాలినేని శ్రీనివాస రెడ్డిని ఒంటరిని చేసి వైవి సుబ్బారెడ్డి రాజకీయం చేస్తున్నారన్న భావన కేడర్లో వ్యక్తం అవుతోంది.

Written By: NARESH, Updated On : May 5, 2023 11:23 pm
Follow us on

Balineni Srinivasa Reddy  : ఒంగోలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి బంధువులు, బావా, బామ్మర్దులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న వైరం పతాక స్థాయికి చేరింది. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు అంతర్గతంగా కొనసాగుతూ ఉంటే.. తాజాగా అవి రచ్చకు చేరాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటతడి పెట్టి మరి వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లోనే ఆందోళనకు కారణమవుతోంది. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది వ్యక్తులు తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి అంకితభావంతో పని చేసిన తనను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒంగోలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ, ప్రస్తుత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి. ఈ జిల్లాలో పార్టీకి గత కొన్నాళ్లుగా అండదండగా ఉంటూ వస్తున్నారు వీళ్లిద్దరు. వీళ్ళిద్దరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి బంధువులు. వీరు కూడా బావా బామ్మర్దులు. అయితే, కొద్ది రోజుల నుంచి వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి మారిపోయింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత కొంతకాలం కలిసి మెలిసి పని చేసినప్పటికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య వ్యవహారం పూర్తిగా చెడిపోయింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ విస్తరించిన తర్వాత.. ఈ జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి, ఇదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను కొనసాగించడంతో అసలు వ్యవహారం పతాక స్థాయికి చేరింది. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి.

బాలినేని ఓడిపోవడంతో పెరిగిన దూరం..

వైవీ సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు బంధువులే అయినప్పటికీ.. రాజకీయంగా అంతర్గత శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ఒంగోలు జిల్లాలో పోటీ చేశారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డి విజయం సాధించగా.. ఎమ్మెల్యే స్థానంలో బరిలోకి దిగిన శ్రీనివాసరెడ్డి ఓటమి పొందారు. తన ఓటమికి వైవి సుబ్బారెడ్డి కారణం అన్న భావన శ్రీనివాసరెడ్డిలో ఎప్పటి నుంచో ఉంది. వీరిద్దరి మధ్య అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు పూర్తిగా బెడిచి కొట్టాయి. 2014లో తన ఓటమికి కారణమైన వైవి సుబ్బారెడ్డికి దెబ్బ కొట్టాలి అన్న ఉద్ధేశంతో 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పార్టీలోకి తీసుకువచ్చి ఎంపీ టికెట్ ఇప్పించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. దీంతో అలిగిన వైవి సుబ్బారెడ్డి కొంతకాలం అమెరికాకు వెళ్లిపోయారు. తర్వాత జగన్ బుజ్జగించి ఇండియాకు తీసుకువచ్చారు. రాజ్యసభ సీటు ఇస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వగా.. తనకు వద్దన్నారు వైవీ. ఆ తరువాత నుంచి వీరిద్దరి మధ్య పుడ్చలేనంతగా అగాధం పెరిగిపోయింది. అయితే, బాబాయ్ వై.వి సుబ్బారెడ్డిని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా నియమించారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఎంపీగా పోటీ చేయాలని వైవి సుబ్బారెడ్డి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తన ప్రయత్నాలను చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డికి టికెట్టు రాకుండా చేయాలనే ప్రయత్నాలను శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నాలు..

ఇక వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య నెలకొన్న వైరాన్ని క్యాష్ చేసుకొనే పనిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. బాలినేని శ్రీనివాస రెడ్డిని ఒంటరిని చేసి వైవి సుబ్బారెడ్డి రాజకీయం చేస్తున్నారన్న భావన కేడర్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జిల్లా మంత్రి ఆది మూల సురేష్ వైవి సుబ్బారెడ్డి వర్గంలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వైవి బాటలోనే నడుస్తున్నారు. జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంటరి అయ్యారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా బాలినేని ఇదే విధమైన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా తనను ఇబ్బందులకు గురిచేసి పార్టీ నుంచి తరిమేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తాను టికెట్లు ఇప్పించిన వాళ్లు కూడా ఇప్పుడు తననే మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు,

ఆదిపత్యం కోసమే ఇద్దరి పోరు..

వీరిద్దరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువులు కావడంతో.. జిల్లాలో వీరు చెప్పిందే జరుగుతుంది. అయితే వీరిద్దరూ ఒక తాటిపై ఉంటే సమస్య ఉండేది కాదు. నా మాటే చెల్లుబాటు కావాలన్న భావన ఇద్దరిలోనూ ఉండడంతో సమస్య ఉత్పన్నమైంది. జిల్లా రాజకీయాలను తానే శాసించాలన్న భావన ఇద్దరిలోనూ పెరిగిపోవడంతో సమస్య పతాక స్థాయికి చేరింది. ఇప్పుడు రచ్చకు చేరి పార్టీని అప్రతిష్ట పాలు చేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న అగాధాన్ని తొలగించి.. ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేయకుండా అధిష్టానం సైలెంట్ గా ఉండడం కూడా ఈ సమస్య తీవ్రత పెరిగి పోవడానికి కారణమైందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికైనా పార్టీ ముఖ్య నాయకులు బరిలోకి దిగి వీరిద్దరి సమస్యను పరిష్కరించకపోతే జిల్లాలో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏమైనా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన గొడవ తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో గట్టిగా కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఒకరు విజయానికి మరొకరు కృషి చేయాల్సింది పోయి.. ఒకరి పతనానికి మరొకరు దారులు వేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ జిల్లాలో నెలకొన్న కుటుంబ సమస్యను సీఎం ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.