Luxury boats in Andhra Pradesh: కేరళలో( Kerala ) పర్యాటకం చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ జలవిహారం చాలా ఆకట్టుకుంటుంది. అందుకే కేరళలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిని ఏపీలో కల్పించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇప్పటికే విశాఖలో అనేక రకాల పర్యాటక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. డబుల్ డెక్కర్ బస్సులు, కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్.. ఇలా ఎన్నెన్నో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఒక్క విశాఖ మాత్రమే కాదు. విజయవాడతోపాటు తిరుపతిలో సైతం పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.
తీర ప్రాంతాల్లో..
ఏపీలో అందమైన నదులు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. కేరళలో ఇదే తరహాలో ఉండగా అక్కడ పర్యాటకుల కోసం ఆల్ట్రా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉంచారు. అక్కడ జలవిహారంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయోగమే ఇప్పుడు మన రాష్ట్రంలో చేస్తోంది పర్యాటకశాఖ. అల్ట్రా లగ్జరీ బోట్లు నడిపే వీలుగా ప్రైవేటు సంస్థలతో చర్చిస్తోంది. అందుకు ఆసక్తి గల సంస్థలను ఇప్పటికే ఆహ్వానించింది. అయితే కేరళలో సేవలందిస్తున్న ఓ సంస్థతో కలిసి ఏపీకి చెందిన మరో సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
విజయవాడలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఈ లగ్జరీ బోట్లు నడవనున్నాయి. ఇందుకు సంబంధించిన సర్వే జరిగింది. విజయవాడలోని బెర్ము పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు రెండు బోట్లు నడిపేందుకు నిర్ణయించారు. అయితే బోటులో 200 మంది వరకు ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రుల్లో భవాని ద్వీపం వద్ద బోట్లు నిలిపేలా జెట్టి తో పాటు విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్ లో సైతం మూడు బోట్లు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ బోట్లు కాదు. ఒక్కో బోటులో విశాలమైన పడక గదులు ఉంటాయి. ఎంచక్కా డిన్నర్ కూడా చేయవచ్చు. మార్గమధ్యంలో సుందరమైన ప్రాంతాలను కూడా గుర్తించారు.
విశాఖ తీరంలో సైతం ఈ బోట్లు నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విశాఖకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఇప్పటికే పోర్టు నుంచి భారీగా నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే ఈ అల్ట్రా డీలక్స్ బోట్లకు సంబంధించి ప్రైవేటు ఆపరేటర్లతో జరుపుతున్నారు. మరోవైపు సర్వే కూడా చేస్తున్నారు.