Balineni Srinivasa Reddy: జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారా అన్న చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆయనను పక్కకు తప్పించారన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్న మధ్యన స్థానిక ఎన్నికల నిర్వహణ కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై 14 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ కమిటీలో బాలినేనికి చోటు లేదు. అలాగే తాజాగా పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి బాలినేనికి ఆహ్వానం లేదట. ప్రస్తుతం ఆయన రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. తాజా పరిణామాలతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* టిడిపి ఎమ్మెల్యేతో విభేదాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన బాలినేని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.. అయితే జనసేనలో బాలినేని పాత్ర పై రకరకాల ప్రచారం నడిచింది. అయితే సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారన్న టాక్ కూడా నడిచింది. కానీ అటువంటిదేమీ లేదు. అయితే ఇటీవల ప్రకాశం జిల్లా స్థానిక రాజకీయాల్లో కూటమి నేతల మధ్య.. మరి ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇరు వర్గాల మధ్య జరిగిన పరిణామాలు ఓటమి సమన్వయాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. మరోవైపు బాలినేని పెత్తనాన్ని జనసేనలోని పాత క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ పరిణామ క్రమంలోనే జనసేన నాయకత్వం బాలినేని విషయంలో వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది.
* పెద్ద ఎత్తున ఫిర్యాదులు..
బాలినేని జనసేనలో చేరిన సమయంలోనే చాలామంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కానీ అప్పట్లో రాష్ట్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనలో చేర్చుకున్నారు. అయితే ఆయన రాకను టిడిపి వర్గాలు కూడా వ్యతిరేకించాయి. జనసేన పాత క్యాడర్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయినా సరే పవన్ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా బాధ్యతలను కట్టబెట్టారు. కానీ అధికార టిడిపి ఎమ్మెల్యే తో ఆయన గొడవలు పెట్టుకోవడం పవన్ దృష్టికి వెళ్ళింది. దానిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. బాలినేని కి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై కూడా జనసేనలో ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే రాజాగా జరిపిన ఈ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం లేదట బాలినేనికి. అయితే ఆ బాధతో వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు. కానీ ఆయన అనుచరులు మాత్రం అనవసరంగా వైసీపీ నుంచి వచ్చాము అంటూ బాధపడుతున్నారు. అయితే బాలినేని విషయంలో జనసేన నాయకత్వం ఏం ఆలోచన చేస్తుందో తెలియడం లేదు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.