Nandamuri Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర చాటుకుంది ఆ కుటుంబం. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని అందుకోగలిగారు. అయితే నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్ తరువాత.. అంతటి పదవులను పొందారు నందమూరి హరికృష్ణ. మంత్రిగా ఆయన ఆరు నెలల పాటు కొనసాగారు. అటు తరువాత ఎన్టీఆర్ పుత్రిక పురందేశ్వరి కేంద్రమంత్రిగా వ్యవహరించారు. అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఆ ఇద్దరు తరువాత నందమూరి బాలకృష్ణ కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. అది అభిమానులకు మింగుడు పడని విషయం. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్న క్రమంలో.. నందమూరి అభిమానుల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. 2014 నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వక పోవడాన్ని వారు తప్పుపడుతున్నారు.
* చిరంజీవితో పోటాపోటీ
నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి కి సమకాలీకుడు. చిరంజీవికి పోటీగా సినిమాలు తీసి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. అయితే రాజకీయంగా గుర్తింపు పొందడంలో మాత్రం వెనుకబడ్డారు. 2001 సమయంలో ఎన్టీఆర్ వారసుడుగా తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని అంతా భావించారు. కానీ ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2004లో ఓడిపోయింది. 2009లో సైతం ఓటమి చవిచూసింది. దీంతో బాలకృష్ణ సైతం వెనుకడుగు వేశారు. కానీ ఇంతలో నారా లోకేష్ బాలకృష్ణ అల్లుడు కావడం, రకరకాల సమీకరణలు మారడంతో 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ కు అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం ఏర్పడింది. అలా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో హిందూపురం నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలో నిలిచారు నందమూరి బాలకృష్ణ. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం హిందూపురంలో గెలిచారు బాలకృష్ణ. గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది తెలుగుదేశం కూటమి. ఇప్పుడు కూడా బాలకృష్ణకు చాన్స్ దక్కలేదు. కానీ ఆయన అల్లుడు నారా లోకేష్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది.
* నాగబాబు కు మంత్రి పదవి
అయితే ఇప్పుడు నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కనుండడంతో బాలకృష్ణను సైతం క్యాబినెట్లోకి తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. నందమూరి కుటుంబంలో హరికృష్ణ తర్వాత ఇంతవరకు ఎవరు మంత్రి కాలేదు. ఆ అసంతృప్తి అయితే అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ సినీ కెరీర్లో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. అటు బుల్లితెరపై మెరుస్తూ తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్నారు. మున్ముందు బాలకృష్ణకు మంచి అవకాశాలు లభించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పొలిటికల్ గా బాలకృష్ణను ఆ స్థాయిలో చూసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆరోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.