https://oktelugu.com/

Chandrababu : రచ్చగెలిస్తే చాలదు…ఇంట గెలవాలి బాబు

లోకేష్ పాదయాత్ర ప్రారంభం పార్టీ శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహం నింపినా.. చంద్రబాబు తన రాజకీయాన్ని రంగరించి కొడితే కానీ చిత్తూరు జిల్లా సెట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. మరి తెలుగుదేశం బాస్ ఏంచేస్తారో చూడాలి మరీ.

Written By:
  • Dharma
  • , Updated On : June 23, 2023 / 05:40 PM IST
    Follow us on

    Chandrababu : ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అప్పుడే పరిపూర్ణ విజయం సాధించినట్టవుతుందంటారు. చంద్రబాబు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. సొంత జిల్లాలో గట్టెక్కలేక సతమతమవుతున్నారు. ఇప్పటికీ అక్కడ వైసీపీ దూకుడుకు బ్రేకులు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీకి దక్కని నియోజకవర్గాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. వరుస మూడుసార్లు ఓడిపోయిన నియోజకవర్గాలు అధికం. అక్కడ కాయకల్పా చికిత్సకే చంద్రబాబు పరిమితమవుతున్నారు. సైకిల్ టైర్ కు పంక్చరు వేసి పరుగులు పెట్టించలేకపోతున్నారు. రాష్ట్రం మొత్తం టీడీపీకి ఊపు వస్తున్నట్టు చెబుతున్నా.. సొంత జిల్లాలో మాత్రం పూర్వ వైభవం తేవడంలో బాబు వెనుకబడిపోతున్నారు.

    చిత్తూరు జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి గెలిచారు. మిగతా 13 స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. రెండు లోక్ సభ సీట్లు సైతం కైవసం చేసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. 2009 నుంచి ఇక్కడ చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపొందుతూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో సైతం పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత నియోజకవర్గం బాబుకు పట్టు దొరకకపోవడం నిజంగా ఇబ్బందికరమే.

    గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కూడా టీడీపీకి గత మూడు ఎన్నికల్లో ఎదురుదెబ్బే. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అపజయమే ఎదురైంది. పూతలపట్టు నియోజకవర్గంలో కూడా సేమ్ సీన్. ఈ రెండు నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో సైతం వైసీపీ పట్టుబిగించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ గెలుపుపై టీడీపీ శ్రేణులే కాన్ఫిడెన్స్ గా చెప్పలేని స్థితి. చిత్తూరు నియోజకవర్గంలో అయితే టీడీపీ ఆవిర్భావం తరువాత దక్కింది మూడే విజయాలు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో సైతం గెలుపు దిశగా లెక్కలేసుకుంటోంది. ఇక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండే డీకే ఆదికేశవులనాయుడు కుటుంబం సైలెంట్ కావడం టీడీపీకి మైనస్ గా మారింది.

    చిత్తూరు జిల్లాలో దాదాపుఅన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వర్గ పోరు ఉంది. కేడర్ బలంగా ఉన్నా సమన్వయం చేసుకునే నాయకత్వం లేదు. సరైన నాయకత్వాన్ని తెచ్చుకుంటే ఇక్కడ పార్టీ బలంగా నిలబడగలదు. కానీ ఎందుకో చంద్రబాబు పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అడుగులు వేయకపోతే ఎన్నికల్లో ఫేస్ చేయడం చాలా కష్టం. లోకేష్ పాదయాత్ర ప్రారంభం పార్టీ శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహం నింపినా.. చంద్రబాబు తన రాజకీయాన్ని రంగరించి కొడితే కానీ చిత్తూరు జిల్లా సెట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. మరి తెలుగుదేశం బాస్ ఏంచేస్తారో చూడాలి మరీ.