https://oktelugu.com/

Ayesha Meera Case : తెరపైకి అయేషా మీరా హత్యకేసు..ఈసారి వారిపైనే సీబీఐ గురి

సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. ఆయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆమె తల్లితండ్రులు.. అసలు దోషుల్ని పట్టుకోవడంలో సీబీఐ విఫలమవుతోందని ఆరోపించారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 4, 2023 / 07:00 PM IST
    Follow us on

    Ayesha Meera Case : అయేషా మీరా.. 15 ఏళ్లు కిందట ఉమ్మడి ఏపీని కుదిపేసిన పేరు. హాస్టల్ లో ఉంటున్న అయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి.. ఆపై చంపేశారు. కానీ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఓ మాజీ మంత్రి సమీప బంధువే కీలక నిందితుడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తూ వచ్చారు. అసలు నిందితుడ్ని తప్పించేందుకే సీబీఐ నత్తనడకన దర్యాప్తు చేస్తోందని ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. మరోసారి దర్యాప్తునకు సీబీఐకి ఆదేశించింది.

    15 ఏళ్ల కిందట..
    బీఫార్మసీ చదవి అయేషా మీరా 2007 డిసెంబరు 7న దారుణ హత్యకు గురైంది. హత్య జరిగిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న ఈ కేసులో దోషి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన అనుమానితుడు సత్యం బాబు సైతం నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే ఈ కేసులో అప్పటి కేబినెట్ మంత్రి సమీప బంధువుపై ఆరోపణలు వచ్చాయి. హాస్టల్ ను అడ్డాగా చేసుకొని అసాంఘిక కార్యకలాపాలు జరిపించేవారని ఆరోపణలున్నాయి. అదే రోజు రాత్రి పార్టీ చేసుకొని.. అసభ్యంగా ప్రవర్తించినందుకు అయేషా మీరా ప్రశ్నించినందునే అత్యాచారం చేసి హత్యచేసినట్టు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తూ వచ్చారు.

    సీబీఐకి అప్పగించినా..
    ఈ ఘటన సంచలనంగా మారి.. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో కేసు సీబీఐకి అప్పగించారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన ఆధారాల రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంతో.. తిరిగి వాటిని సేకరించడం సీబీఐకి సవాల్‌గా మారింది. మృతదేహాన్ని రీ పోస్టుమార్టం కూడా జరిపించారు. కానీ నిందితులను పట్టుకోలేకపోయారు. కోర్టుల్లో సాక్ష్యాలు సమర్పించడంలో దర్యాప్తు సంస్ధలు, అధికారులు విఫలమయ్యారు. దీంతో కోర్టులు వారిని నిర్దోషులుగా తేల్చి విడిచి పెట్టాయి. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణను ప్రారంభించింది. నందిగామ డీఎస్పీగా ఉన్న శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారుల్ని సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    తల్లిదండ్రుల పోరాటంతో..
    అయేషా మీరా హత్యలోనిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె తల్లిదండ్రులు గట్టిగానే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. ఆయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆమె తల్లితండ్రులు.. అసలు దోషుల్ని పట్టుకోవడంలో సీబీఐ విఫలమవుతోందని ఆరోపించారు. సీబీఐపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీబీఐ తాజాగా తిరిగి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించారంటూ అప్పటి విజయవాడ సీపీ, ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఐపీఎస్ సీవీ ఆనంద్ తో పాటు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపైనా ఆయేషా మీరా తల్లితండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో సీబీఐ వారిని విచారించే అవకాశముంది.