Home Minister Mahmood Ali: భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. అనుకున్న ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్లారు. ఆయన వెంట పార్టీ జనరల్ సెక్రెటరీ కేశవరావు, ఆర్ అండ్ బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, పలువురు ఉన్నారు.. వెంటనే ఆయన తన కుర్చీలో కూర్చొని.. మినిట్స్ రికార్డ్స్ లో సంతకం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానాల్లో ఢిల్లీ వెళ్లిన హోంమంత్రి అక్కడ ఎయిర్ కోర్టు నుంచి కారులో వసంత విహార్ లోని భారత సమితి కార్యాలయానికి బయలుదేరారు.. అయితే అక్కడ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. అంతేకాదు కారు ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
పాపం హోంమంత్రి
ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో మహమూద్ అలీ మౌనంగా ఉండి పోయారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి అని అక్కడి పోలీసులకు తెలియదు కాబోలు. సాధారణ పౌరుడు అనుకొని భద్రతా చర్యల్లో భాగంగా అలా ప్రవర్తించారు. దీంతో చేరుకున్న హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ తాను తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి అని చెప్పడంతో అక్కడి పోలీసులు దెబ్బకు కంగు తిన్నారు. పొరపాటున అలా జరిగిందని క్షమాపణ చెప్పి, తర్వాత ఆయనను లోపలికి పంపించారు. దీంతో మహమూద్ అలీ తన కారు లో నేరుగా పార్టీ ఆఫీసు లోపలికి వెళ్లారు. ఆయనకు భారత రాష్ట్ర సమితి నాయకులు స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. అయితే ఢిల్లీ పోలీసుల నిర్వాకంతో మనసు నొచ్చుకున్న ఆయన ఒకింత నిర్వేదంగా కనిపించారు.
ఇదేం మొదటిసారి కాదు
మహమూద్ అలీ కి ఢిల్లీ పోలీసులనుంచి మాత్రమే కాదు.. సొంత రాష్ట్రం తెలంగాణలో ప్రగతిభవన్లో ఇలాంటి అనుభవమే ఎదురయింది. అయితే ఆ సమయంలో కోవిడ్ తీవ్రంగా ఉంది. కరోనా ను కట్టడి చేసేందుకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం పంపారు. అయితే ఆ సమావేశంలో పాల్గొనేందుకు మహమూద్ అలీ నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు. అయితే అక్కడి భద్రత సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఢిల్లీలో చెప్పినట్టే తాను హోం మంత్రిని మహమూద్ అలీ వివరించారు. అక్కడ పోలీసులు ఆయనను అనుమతించలేదు. చేసేది ఏమీ లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.
మీడియాకు కూడా అనుమతి లేదు
ఇక భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవం సంబంధించి కూడా కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాకు అనుమతి లభించలేదు. ఆ కార్యాలయం ముందు నుంచే పోలీసులు మీడియా ప్రతినిధులను బయటకి పంపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.. పై నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వారు మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు. నిన్న సచివాలయం, నేడు భారత రాష్ట్ర సమితి కార్యాలయం ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వకపోవడం పట్ల మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు. కేవలం తాము భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ప్రెస్ నోట్లు రాసి ఎందుకు మాత్రమే పనికి వస్తామా అని ప్రశ్నిస్తున్నారు.