Ayesha Meera Case Updates: ఏపీలో( Andhra Pradesh) సంచలన కేసులు ఏవి ఒక కొలిక్కి రావడం లేదు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినా బాధితులకు న్యాయం జరగడం లేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన నేత సోదరుడు, మరో సీఎం బాబాయ్, ఆపై మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య అంశం తేల్చలేని స్థితిలో దర్యాప్తు సంస్థలు ఉండడం ఆవేదన కలిగిస్తోంది. అలాగే సుగాలి ప్రీతి కేసు.. అంతకుముందే సంచలనం సృష్టించిన అయోషా మీరా హత్య కేసులో బాధితులకు ఉపశమనం కలగకపోవడం.. సరైన న్యాయం దక్కకపోవడం నిజంగా బాధాకరం. అయోషా మీరా హత్య కేసులో సత్యం బాబు అనే వ్యక్తి నిందితుడు అని సిబిఐ చెబుతుండగా.. కాదంటున్నారు మృతురాలి తల్లిదండ్రులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యుడు నిందితుడని ఆరోపించారు. ఇప్పుడు సత్యం బాబు నిందితుడని.. మీ అభ్యంతరాలు తెలపాలని..సిబిఐ నోటీసులు ఇచ్చినా వారు స్పందించడం లేదు. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది.
18 సంవత్సరాల కిందట..
2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) ఉండేవారు. ఆ ఏడాది డిసెంబర్ 27న ఇబ్రహీంపట్నంలోని ఓ లేడీస్ హాస్టల్ లో అయోషా మీరా అనే విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సత్యం బాబు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే 2017 మార్చి 31న హైకోర్టు ఆ కేసును కొట్టివేసి సత్యం బాబుని నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై అయోషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 2018లో దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సిబీఐ మూడు నెలల క్రితం నివేదికను హైకోర్టుకు అందజేసింది. అయితే ఆ నివేదికను తమకు ఇవ్వాలంటూ అయోషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ విషయాన్ని సిబిఐ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే వారు విజయవాడలోని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసినా వారికి ఇంత వరకూ నివేదిక ఇవ్వలేదు.
నోటీసులు జారీ..
అయితే ఇప్పుడు సిబిఐ సత్యంబాబు( Satyam Babu) నిందితుడు అని తేల్చింది. ఇందుకు సంబంధించిన సెక్షన్ల పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని అయోషా తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు జారీచేసింది. అయితే ఈ కేసులో సిబిఐ నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని.. కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ అయోషా తల్లిదండ్రులు సమాధానం ఇచ్చారు. సిబిఐ నివేదికలో ఏముందో తెలియకుండా పాము ఎలా స్పందిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. తమ మత విశ్వాసాలకు భిన్నంగా ఖననం చేసిన అయోషా మీరా శరీర భాగాలను అప్పగించామని.. నెల రోజుల్లో తిరిగి ఇస్తామని చెప్పారని.. ఆరు ఏళ్లు అయినా తమకు అప్పగించ లేదని వారు వాపోయారు. కార్యాలయాల చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదని.. అందుకే సిబిఐ విచారణకు కోర్టుకు తాము హాజరు కాలేమంటూ పేర్కొన్నారు. మొత్తానికి అయితే సిబిఐ సత్యంబాబు నిందితుడని చెబుతుండగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అందుకు అంగీకరించేందుకు ఆసక్తి చూపడం లేదు. మరి కోర్టులో సిబిఐ ఏం చెబుతుందో చూడాలి.