Andhra Pradesh : దేశం మొత్తం దసరా పండుగ సంబరాల్లో ఉంటే.. ఆ ఇంట్లో మాత్రం దారుణం చోటుచేసుకుంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

దేశం మొత్తం దసరా సంబరాల్లో ఉంది. విభిన్న రీతుల్లో దసరా పండుగను జరుపుకుంటున్నది. అంతా బాగుంటే ఆ ఇంట్లో కూడా దసరా సంబరాలు జరిగేవి. వేడుకలు మిన్నంటివి. కానీ కొందరు దుర్మార్గులు చేసిన పని.. ఆ ఇంట్లో దారుణానికి కారణమైంది.

Written By: NARESH, Updated On : October 12, 2024 4:22 pm
Follow us on

Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్య సాయి జిల్లాలోని చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లిలో దారుణం చోటుచేసుకుంది. దసరా పండుగ వేళ అత్తా కోడలిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.. దుండగులు కత్తితో బెదిరించి అత్తా కోడలి పై అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో నల్లబొమ్మనిపల్లికి వలస వచ్చింది. ఆ కుటుంబంలో తండ్రి కొడుకు, వారి భార్యలు ఉన్నారు. అయితే వారు స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అందులో తండ్రి వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. కొడుకు, కోడలు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వాచ్ మన్ భార్య ఆ ఫ్యాక్టరీలోనే చిన్నా చితకా పనులు చేస్తోంది. అయితే శుక్రవారం రాత్రి వాచ్ మన్, అతని కుటుంబం ఇంట్లో పడుకొని ఉన్నారు. ఈ క్రమంలో కొంతమంది ద్విచక్ర వాహనాలపై వచ్చి గట్టిగా శబ్దాలు చేశారు. ఎవరా అని వారు బయటకు వచ్చి చూడగా.. వాచ్ మన్, అతడి కొడుకు పై దాడి చేశారు. ఆ తర్వాత వాచ్ మన్ భార్య, ఆమె కోడలిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.. వారు ఒంటరిగా ఉన్నది చూసిన దుండగులు కత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు దుండగులు పాలుపంచుకున్నారని తెలుస్తోంది. అయితే వీరి కుటుంబం ఒంటరిగా నివసిస్తున్న నేపథ్యంలో దుండగులు టార్గెట్ చేశారని తెలుస్తోంది.. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది.

ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ..

ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఎస్పీ రత్నప్రభ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.. పోలీసులు ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఆ పేపర్ మిల్లులో పనిచేస్తున్న వారి వద్ద నుంచి పోలీసులు వివరాలు సేకరించారు..”ఈ ఘటనకు సంబంధించి మాకు ఫిర్యాదు అందింది. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాం. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలను సేకరిస్తున్నాం. ఇప్పటికే అత్యాచారానికి గురైన ఆ అత్తాకోడలిని ఆసుపత్రికి పంపించాం. వారికి వైద్య పరీక్షలు నిర్వహించాం. వారి వద్ద నుంచి వైద్యులు నమూనాలు సేకరించారు.. కేసు కు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. సున్నితమైన అంశం కావడంతో వివరాలు బయటకి పొక్కకుండా చూస్తున్నాం. మీడియా కూడా సమయమనం పాటించాలని” పోలీసులు పేర్కొంటున్నారు. ఆ ఘటనకు పాల్పడే సమయంలో దుండగులు మద్యం తాగి ఉన్నారని.. ఆ మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్థానికులు అంటున్నారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, అత్యాచారానికి గురైన అత్తా కోడలు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.