Atma Sakshi Survey 2024: ఏపీలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమవుతోంది.ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11 వరకు ప్రచారానికి సమయం ఉంది. కేవలం ఐదు రోజుల వ్యవధి ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.ఈరోజు ఏపీకి ప్రధాని మోదీ రానున్నారు. కూటమి తరుపున ప్రచారం చేయనున్నారు. గెలుపు మాదంటే మాది అని అధికార వైసిపి.. విపక్ష ఎన్డీఏ కూటమి చెప్పుకొస్తున్నాయి. అదే సమయంలో సర్వేలు సైతం హల్చల్ చేస్తున్నాయి. టీవీ9 రవి ప్రకాష్ ఇటీవల తన ఆర్ టివి పేరిట చేసిన సర్వేలో టిడిపి కూటమిదే విజయం అని తేలింది. అయితే తాజాగా ఆత్మసాక్షి సర్వే పేరిట ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 23 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ వర్సెస్ టిడిపి కూటమి అన్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కీలక నేతలను ఈసారి పోటీలో పెట్టింది కాంగ్రెస్. దీంతో కొన్నిచోట్ల త్రిముఖ పోటీ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ చీల్చే ఓట్లతో వైసీపీకినష్టమన్న విశ్లేషణలు ఉన్నాయి.మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. కూటమికే మొగ్గు కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మెజారిటీ సర్వేలు సైతం టిడిపి కూటమిదే అధికారమని తేల్చి చెబుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆత్మసాక్షి సర్వే వైసిపికి భారీ గెలుపు ఉంటుందని తేల్చి చెప్పడం విశేషం.
అధికార వైసిపి మరోసారి అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. మూడు పార్టీలు కూటమి కట్టినా.. ఏపీ ప్రజలు మాత్రం వైసిపి కె జై కొట్టారని తెలుస్తోంది. అధికార వైసీపీకి 95 నుంచి 113 స్థానాలు దగ్గర అవకాశం ఉందని.. టిడిపి కూటమికి 56 నుంచి 63 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. అయితే నేరుగా ఆ సంస్థ ప్రకటించినట్టు ఎక్కడా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. వైసిపి శ్రేణులు పెద్ద ఎత్తునవైరల్ చేస్తున్నారు.