AP Elections 2024: ఏపీలో పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. నామినేషన్ల పర్వం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అభ్యర్థులు మంచి ముహూర్తాన నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో వారి ఆస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. కేసుల రూపంలో నేరచరిత్ర సైతం బయట పెట్టాల్సి వస్తోంది. ఈనెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. అందులో టాప్ ఎవరు? లాస్ట్ లో ఎవరు ఉన్నారు? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకరికి మించి ఒకరి ఆస్తులు బయటపడుతుండడంతో హాట్ టాపిక్ గా మారుతోంది.
గత రెండు రోజులుగా వందలాదిమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రధాన పార్టీ అభ్యర్థుల సైతం ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన నామినేషన్లలో కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా చూపారు. అందులో ప్రశాంతి రెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరిట రూ.639.26 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. అటు అప్పులుగా రూ.197.29కోట్లను చూపారు. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
వేమిరెడ్డి దంపతుల తరువాత స్థానంలో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నిలిచారు. ఆమె తన ఆస్తులను రూ.161.21 కోట్లుగా చూపారు. రూ.7.82 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఆస్తులు విలువ పదేళ్లలో భారీగా పెరిగాయి. ఆయన కుటుంబం ఆస్తులు విలువ రూ.131.71 కోట్లుగా పేర్కొన్నారు. రూ.28.24 కోట్లు అప్పులుగా చూపారు. 2014లో రూ.48.89 కోట్ల ఆస్తులను చూపగా.. 2019లో మాత్రం రూ.37.27కోట్లుగా పేర్కొన్నారు.అయితే ఈ ఐదేళ్లలో ఆస్తులు దాదాపు 100 కోట్లు పెరగడం హార్ట్ టాపిక్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ ఆస్తులు,అప్పుల వివరాలు కూడా బయటకు వచ్చాయి.హిందూపురం నుంచి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. తన ఆస్తులు విలువ రూ.81.63కోట్లుగా బాలకృష్ణ చూపారు.9 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. బాలకృష్ణ భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140కోట్లుగా చూపారు. మూడు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తానికి అయితే ఎన్నికల అఫీడవిట్ల పుణ్యమా అని రాజకీయ శ్రీమంతుల ఆస్తుల వివరాలు బయటకు వస్తున్నాయి.