Asian Roller Skating Championship: ఏపీ పేరు మరోసారి మార్మోగనుంది. అంతర్జాతీయ స్థాయి క్రీడా సంబరానికి వేదిక కానుంది. ఏపీలో ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఆతిథ్య హక్కులు ఈసారి ఇండియాకు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈసారి పోటీల ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మేరకు రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొత్తం 11 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఆసియా ఖండానికి చెందిన 30 దేశాలు ఇందులో పాల్గొంటాయి. మూడు వేల మంది క్రీడాకారులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే 3000 మంది ప్రతినిధులు కూడా వస్తారు. అందుకే దీనికి పక్కాగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే నవ్యాంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కనున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు సమాచారం.
* శాప్ సంపూర్ణ సహకారం
అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీకి అవకాశం రావడంతో క్రీడా విభాగాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, ఎండి పిఎస్ గిరీషా, ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ పోటీలను విజయవంతం చేయడానికి శాప్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా 2027 సెప్టెంబర్ లో ఈ పోటీలు జరగనున్నాయి. ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎక్కడ నిర్వహించినా ప్రతిష్టాత్మకంగా జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
* క్రీడలకు పెద్దపీట
ఏపీలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల నూతన క్రీడా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచింది. అలాగే ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచే రాష్ట్ర క్రీడాకారులకు కూడా భారీగా నజరానాలు ఇవ్వనున్నారు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి గతంలో 75 లక్షలు ప్రోత్సాహం ఇచ్చేవారు. టిడిపి కూటమి సర్కార్ ఆ ప్రోత్సాహకాన్ని 10రెట్లు కు పెంచింది. ఏడు కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే ఏపీ క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా నిర్ణయం తీసుకుంది.