Vishaka MLC Election : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో బిగ్ ట్విస్ట్. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికకు దూరమైనట్లు తెలుస్తోంది. హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ఈరోజు తుది గడువు. టిడిపి అభ్యర్థి రంగంలో ఉంటారా? ఉండరా? అన్నది తెలియాల్సి ఉంది. టిడిపి అనుకూల మీడియాలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికకు ఆ పార్టీ దూరం అని ప్రత్యేక కథనం వచ్చింది. స్థానిక సంస్థల్లో 60 శాతానికి పైగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఉండడంతో.. ఎమ్మెల్సీని వదులుకోవడమే బెటర్ అని టిడిపి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందటే భారీ మెజారిటీతో కూటమి గెలిచింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ని తప్పనిసరిగా గెలవాలన్న పరిస్థితి లేదు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చంద్రబాబు అంచనా వేశారు. పోటీ పెట్టడానికి ముందుకు రానట్లు తెలుస్తోంది. ఏమాత్రం తేడా కొట్టినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది. అందుకే చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీనికి తోడు చాలా మంది టిడిపి నేతలు పోటీ పెట్టకపోవడమే బెటర్ అని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలిపించుకుంటామని ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే అంత రిస్క్ తీసుకుని పోటీ చేయాల్సిన పనిలేదని హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* బొత్స నామినేషన్
నిన్ననే వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 860 ఓట్లకు గాను.. వైసీపీకి 600 వరకు బలం ఉంది. టిడిపి కూటమికి 300 వరకు బలం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం, అనకాపల్లి, ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లకు సైతం ఓట్లు ఉన్నాయి. ఉమ్మడి విశాఖలో రెండు నియోజకవర్గాలు తప్పించి.. అన్నిచోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. దీంతో స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి వైపు వచ్చారు. అయితే వారంతా టిడిపి కూటమి అభ్యర్థికి ఓటు వేస్తారా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి.
* సీఎం వరుస భేటీలు
ఉమ్మడి విశాఖ పార్టీ శ్రేణులతో చంద్రబాబు రెండుసార్లు సమావేశం అయ్యారు. అయితే టిడిపి నేతల నుంచి అంతగా సానుకూలత రాకపోవడంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. దాదాపు 200 ఓట్లు తిప్పుకుంటేనే విజయం దక్కేది. ఇప్పటికే వైసీపీ బెంగళూరు శిబిరానికి తమ ఓటర్లను తరలించింది. ఇంతటి తక్కువ సమయంలో వారిని తిప్పుకోవడం కష్టమైన పని. అందుకే పోటీ చేయకపోవడమే ఉత్తమమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క ఎమ్మెల్సీ సీటు పోతే వచ్చేదేమీ లేదని.. వదిలేయడమే గౌరవంగా ఉంటుందని కీలక నేతల సైతం సూచన చేసినట్లు సమాచారం.
* గత అనుభవాల దృష్ట్యా
గత ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైసిపి బెదిరింపులకు దిగింది. స్థానిక సంస్థలను సైతం బలవంతంగా ఏకగ్రీవం చేసుకుంది. చాలా రకాల విమర్శలు అప్పట్లో వచ్చాయి. అందుకే ఈ విషయంలో కూటమి జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని భావిస్తోంది. అందుకే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు సమాచారం. ఈరోజు చివరి రోజు కావడంతో కూటమి తరుపున నామినేషన్ పడకపోతే.. బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయినట్టే.