APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ( APSRTC) సరికొత్త రికార్డులను తిరగరాసింది. సంక్రాంతికి భారీ వసూళ్లను రాబెట్టింది. ప్రత్యేక సర్వీసులు నడపడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరింది. ఎటువంటి అదనపు చార్జీలు లేకుండానే.. సంక్రాంతికి తగ్గ ప్రతిఫలం రాబట్టుకుంది. తద్వారా ఓ కొత్త మోడల్ ప్రయోగించి భారీ ప్రయోజనం పొందింది. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతిరోజు సగటున రూ.20 కోట్ల మేర ఆదాయం లభించినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. సాధారణంగా ఏపీ ప్రజలు అతి పెద్ద పండుగ ఇది. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం సొంత గ్రామాలకు వస్తుంటారు. అయితే ఈసారి ఏపీఎస్ఆర్టీసీ ముందస్తు ఆలోచన చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపింది. అదనపు సర్వీసులను సైతం ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలోని వివిధ నగరాలకు, పట్టణాలకు అనుసంధానిస్తూ ఆర్టీసీ సర్వీసులు నడిచాయి. అయితే ఇలా ఏర్పాటు చేసిన ప్రతి బస్సు రద్దీగా కనిపించింది. దీంతో ఆర్టీసీకి భారీ ఎత్తున ఆదాయం సమకూరింది.
* తొమ్మిది వేలకు పైగా సర్వీసులు
ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ( APSRTC) మొత్తం తొమ్మిది వేలకు పైగా ప్రత్యేక బస్సులను నడిపింది. జనవరి 8 నుంచి 20 వరకు.. ఈ సర్వీసులు నడిచాయి. సాధారణ సర్వీసులను కలుపుకొని సగటున రోజుకు రూ. 20 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ. కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారానే రూ. 21 కోట్లు వచ్చినట్లు చెబుతోంది. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈనెల 20న ఒక్కరోజే రూ. 23.71 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆర్జించగలిగింది. ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఒక రికార్డుగా చెబుతున్నారు ఉద్యోగులు, అధికారులు. గతంలో సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపేవారు. కానీ అదనపు చార్జీలు వసూలు చేసేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటివి లేవు. కేవలం సాధారణ చార్జీలతోనే ఈ ఘనత సాధించింది ఏపీఎస్ఆర్టీసీ.
* పెద్ద ఎత్తున రాయితీ
ఈ ఏడాది ఆర్టీసీ( RTC) ప్రయాణికులను ఆకట్టుకోగలిగింది. సంక్రాంతి సందర్భంగా ముందస్తు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా అందించింది. మరోవైపు ప్రధాన నగరాల నుంచి సూపర్ లగ్జరీ ఏసీ బస్సులను కూడా నడిపింది. పక్కనే ఉన్న తెలంగాణ ఆర్టీసీ సైతం సంక్రాంతి రద్దీ ని క్యాష్ చేసుకుంది. అయితే ఈ ఏడాది అధికారులు ముందస్తుగానే అప్రమత్తం అయ్యారు. ప్రత్యేక సర్వీసుల విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాని ఫలితంగానే ఎక్కువమంది ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు.
* కొత్త బస్సుల రాకతో
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు సమకూరాయి. సంక్రాంతికి ముందే కొత్త బస్సులను ప్రారంభించారు. ఇది కూడా కలిసి వచ్చిన అంశం. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు సైతం సంక్రాంతికి సమన్వయంతో పనిచేయగలిగారు. దాదాపు అన్ని డిపోల నుంచి నగరాలకు బస్సులు నడిచాయి. కొన్ని డిపోలు ప్రధాన పట్టణాలు కలుపుతూ ప్రత్యేక సర్వీసులను నడిపాయి. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే 2025 సంక్రాంతి రికార్డుగా చెబుతున్నారు అధికారులు. ప్రతి పండుగకు ఇదే ఫార్ములాను అనుసరిస్తే ఆర్టీసీకి కాసుల వర్షం కురిసినట్టే. ఆర్టీసీలో ఆన్లైన్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాతే ఆదరణ పెరుగుతోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఏపిఎస్ఆర్టిసి పై ఉంది.