APSRTC Free Temple Buses: ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ( APSRTC ) బస్సుల్లో మహిళల సందడి కనిపిస్తోంది. స్త్రీ శక్తి పథకం లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మొదలైన మూడో రోజు కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళల సందడి కనిపించింది. చాలామంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లలో మహిళలు కిటకిటలాడుతూ కనిపించారు. ప్రీమియర్ సర్వీసులైన నాన్ స్టాప్, సూపర్ డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు మాత్రం కేవలం మగవారితో కనిపిస్తున్నాయి. ప్రీమియర్ సర్వీసుల కంటే.. ఉచిత ప్రయాణ బస్సుల్లోనే మహిళలు ఎక్కువగా కనిపిస్తుండడం విశేషం.
Also Read: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.. స్పందన ఎలా ఉందంటే?
ఈరోజు నుంచి 20 లక్షలమంది..
స్వాతంత్ర దినోత్సవం( Independence Day ) సందర్భంగా శుక్రవారం సాయంత్రం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే శని ఆదివారాల్లో.. దాదాపు 13.30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ పథకం కింద ప్రయాణం చేశారు. దీని ద్వారా వారికి రూ.5.46 కోట్ల వరకు లాభం చేకూరింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 12.18 లక్షల మంది ప్రయాణించగా.. వారికి రూ.4.74 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అయితే పథకం ప్రారంభం అయిన తరువాత సెలవు దినాలు అధికం. శనివారం శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సాధారణ సెలవు కావడంతోనే మహిళలతో పాటు విద్యార్థులు తక్కువగా కనిపించారు. ఈరోజు నుంచి సగటున 20 లక్షల వరకు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.
Also Read: ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. వారికి మాత్రం 15 రోజుల తర్వాతే!
దేవస్థాన ప్రత్యేక బస్సుల్లో
ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు నడిపే వివిధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రకటన జారీ చేసింది. మరోవైపు స్త్రీ శక్తి( sthree Sakthi ) పథకం ద్వారా వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. డబల్ డ్యూటీ చేసిన సిబ్బందికి, ఆన్ కాల్ డ్రైవర్లకు సమస్త చెల్లించే డబ్బును పెంచింది. ఇప్పుడు డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రతి కిలోమీటర్ కు మూడు రూపాయలు ఇస్తారు. వెంటనే ఆ డబ్బులు చెల్లిస్తారు. డబుల్ డ్యూటీ చేసే వారికి, అందుబాటులో ఉండే డ్రైవర్లకు ఇది మంచి ప్రోత్సాహం అవుతుంది. దీనిని ఆహ్వానిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు.