AP Weather: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితి కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఇంకోవైపు వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతూ వస్తున్నాయి. పైగా కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలకు ఏడుగురు మృత్యువాత పడ్డారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు సూచించారు. ఈరోజు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.
Also Read: అమరావతి’ బాధ్యతను ఆ నేతకు అప్పగించిన జగన్!
* పిడుగులతో ప్రాణ నష్టం.. రాష్ట్రవ్యాప్తంగా( state wide) చాలా జిల్లాల్లో వర్షాలు పడుతుండడంతో చల్లటి వాతావరణం నెలకొంటుంది. అయితే వర్షాలు కంటే ఉరుములు, మెరుపులు అధికంగా ఉన్నాయి. పిడుగులపాటు ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో చాలాచోట్ల రికార్డు స్థాయిలో వర్షం నమోదయింది. కాకినాడ జిల్లా కాజులూరు లో 100.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చొల్లంగి పేటలో 94.5, కరపలో 75.5, కాకినాడలో 66.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 130 చోట్ల 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం విశేషం. మధ్యాహ్నం వరకు ఎండకాస్తోంది.. ఒక్కసారిగా మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన వర్షాలు పడుతుండడంతో ప్రజల్లో ఒక రకమైన భయాందోళన నెలకొంటుంది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో చాలాచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ఏడుగురు చనిపోయారు. చెట్టు కూలిపోయి మరొకరు ప్రాణాలు వదిలారు. హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
* పంటలకు అపార నష్టం..
చాలా ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. దాదాపు 50 వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కోతకు సిద్ధంగా ఉన్నవారి నేలకొరిగింది. రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయాయి. వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం అయ్యాయి. మొక్కజొన్న రైతులు కూడా నష్టపోయారు. ప్రధానంగా చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో నష్టం తీవ్రత అధికంగా ఉంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో అరటి, బొప్పాయి, మామిడి రైతులు నష్టపోయారు.
* సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు..
మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. ఆదివారం నంద్యాల( Nandyala district ) జిల్లా గోకవరంలో 42.7°, నెల్లూరు జిల్లా సోమశిల లో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మ నాథ్ తెలిపారు.