AP Traffic Rules : దేశవ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్( new traffic rules) అమల్లోకి వచ్చాయి. ఏపీలో సైతం అమలు చేస్తున్నారు పోలీసులు. గతం మాదిరిగా కాకుండా భారీగా జరిమానాలు, ఫైన్ లు పెరిగాయి. పోలీసులు గట్టిగానే తనిఖీలు చేస్తున్నారు. రకరకాల ఒత్తిళ్లు వస్తున్నా తలొగ్గడం లేదు. దీనిపై ఫిర్యాదులు వస్తున్న వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఏపీవ్యాప్తంగా హెల్మెట్ ధారణ, ధ్రువపత్రాలకు సంబంధించి వాహనదారులు నిబంధనలు పాటిస్తున్నారు. అయితే ఒకేసారి పోలీసులు పట్టు బిగించడంతో కొన్నిచోట్ల అసౌకర్యానికి గురవుతున్నారు. దీనిపైనే శాసనసభలో కీలక ప్రకటన చేశారు హోమ్ మంత్రి వంగలపూడి అనిత. సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నపై సమాధానం చెబుతూ.. ఏ పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నామో వివరించే ప్రయత్నం చేశారు.
Also Read : ఆ స్టిక్కర్లపై పోలీస్ నిఘా.. విజయవాడలో 211 మందికి షాక్
* పెరిగిన జరిమానాలు, ఫైన్లు
ఇటీవల సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదాల నియంత్రణకు పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీగా జరిమానాలు, ఫైన్ లు విధిస్తే వాహనదారులు రూట్లోకి వస్తారని భావిస్తోంది పోలీస్ శాఖ. అందుకే ఇప్పటివరకు ఉన్న జరిమానాలు, కేసుల తీవ్రతను మరింత పెంచింది. శిక్షలను కూడా అమలు చేస్తోంది. దీనిపై శాసనసభలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత కాస్త భావోద్వేగానికి గురయ్యారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు మానవతా దృక్పథం దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.
* కొన్ని చిత్రాలను ప్రదర్శిస్తూ..
ఈ సందర్భంగా హోం మంత్రి ( Home Minister)కొన్ని చిత్రాలను ప్రదర్శిస్తూ సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. పిల్లలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎంతోమంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని.. దానిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించామని.. అయినా చాలామంది హెల్మెట్ ను ధరించడం లేదని.. అందుకే ఈ వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అనిత. ప్రాణమా? 1000 రూపాయలా? అనే సున్నితత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. పౌరుల్లో మార్పు కోసమే 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు జరిమానా పెంచినట్లు చెప్పుకొచ్చారు. ఎదుటివారి అజాగ్రత్త వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని.. హెల్మెట్ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందని.. అందుకే కఠిన చట్టాలను అమలు చేయక తప్పదని తేల్చి చెప్పారు హోం మంత్రి అనిత.