AP Students : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు సైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇవ్వనుంది. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఈ సైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వనున్నారు. ఈ సైనింగ్ స్టార్స్ అవార్డుల కోసం ఏపీ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. జూన్ 9న విద్యార్థులకు అవార్డులతో పాటు రూ.20 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. విద్యార్థుల మధ్య పోటీ పెంచేలా.. వారిని ప్రోత్సహించేలా ఈ కొత్త కార్యక్రమం అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇక ప్రతి ఏటా ఈ అవార్డులు అందించనున్నారు.
* ఇలా ఎంపిక చేస్తారు..
ఈ షైనింగ్ స్టార్స్( shining stars ) అవార్డుల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ఈ మేరకు గైడ్లైన్స్ విడుదల చేశారు. పదో తరగతితో పాటు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తారు. ఈ ఏడాది పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు స్కూళ్లలో చదివి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి ఎంపిక చేస్తారు. మండలాల వారిగా ఎంపిక ఉంటుంది. జూన్ 9న అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వనున్నారు.
Also Read : సర్కారు బడి నుంచి.. అంతర్జాతీయ స్థాయికి.. ఏపీ విద్యార్థులు సాధించిన ఘనత ఇదీ
* మార్గదర్శకాలు ఇవే..
పదో తరగతికి( 10th class ) సంబంధించి 500 మార్కులకు పైగా సాధించి ఉండాలి. ప్రతి మండలంలో ఆరుగురు విద్యార్థులను ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులను ఒక్కొక్కరి చొప్పున ఇద్దరిని.. అలాగే ఓసి, బీసీ సామాజిక వర్గాలనుంచి ఇద్దరేసి చొప్పున.. మొత్తం ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి ప్రతి జిల్లాలో 36 మంది విద్యార్థులను అవార్డుల కోసం ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి సర్టిఫికెట్ తో పాటు మెడల్ అందిస్తారు. 20వేల రూపాయలు నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. కేవలం విద్యావ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.