Andhra Pradesh 10th Results 2026: ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గత ఏడాది 81.14% ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4.15% ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. అయితే ఈసారి కూడా అమ్మాయిలు సత్తా చాటారు. 87.90% ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల విషయానికి వస్తే కేవలం 82.68 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 5.22 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈసారి ఏకంగా 83.69 శాతం మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం విశేషం.
* ఇంగ్లీషులో తగ్గిన మార్క్..
ఈసారి 600కు 600 మార్కులు సాధ్యపడలేదు. గత ఏడాది కాకినాడకు( Kakinada) చెందిన నేహాంజని 600 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు. కానీ ఈ ఏడాది మాత్రం స్టేట్ టాపర్ గా 599 మార్కులు మాత్రం వచ్చాయి. విశాఖకు చెందిన కే. జ్ఞానేశ్వరి ఈ ఘనత సాధించారు. ఆమె అన్నిటిలోని చైతన్య స్కూల్లో చదివారు. ఆమె తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి భారతి విశాఖ నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగిని. అయితే సరిగ్గా పరీక్షలకు ముందు జ్ఞానేశ్వరి జ్వరం బారిన పడ్డారు. కానీ ఆమె కోలుకొని పరీక్షలు రాసి మంచి మార్కులు సంపాదించారు. 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి సత్తా చాటారు. ఇంగ్లీషులో ఒక్క మార్కు తగ్గిపోయింది. భవిష్యత్తులో డాక్టర్ కావాలని లక్ష్యంతో చదువుతున్నట్లు జ్ఞానేశ్వరి చెబుతున్నారు.
* ఈసారి అన్ని ప్రత్యేకతలే..
అయితే ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు మెరుగుపడ్డాయి. మరోవైపు 16 పాఠశాలల్లో అయితే ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. 2161 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదయింది. పార్వతీపురం మన్యం జిల్లా 96.07%తో టాప్ లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12%తో చివరి స్థానంలో ఉంది. విశాఖకు చెందిన జ్ఞానేశ్వర్ కి 599 మార్కులు రాగా.. రాష్ట్రవ్యాప్తంగా 47 మంది విద్యార్థులకు 598 మార్కులు వచ్చాయి. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రికార్డు స్థాయిలో 96.04% ఉత్తీర్ణత నమోదయింది. మరోవైపు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు మే 1 నుంచి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కు సైతం అవకాశం కల్పించారు.