AP sleeper bus ban: ఇటీవల బస్సు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఏపీలోనే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవ దహనం అవుతున్నారు. ముఖ్యంగా స్లీపర్ కోచ్ వల్లే ఈ పరిస్థితి అని ఒక అంచనా ఉంది. అత్యాధునిక బస్సులు అందుబాటులోకి వచ్చాయి కానీ.. ఏసి స్లీపర్, ఇతరత్రా కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం స్లీపర్ బస్సుల నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న జనం బయటపడే అవకాశం లేదు. అందుకే వారు ఎక్కువగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ప్రమాదాలకు కారణం అవుతున్న స్లీపర్ బస్సులను నిషేధిస్తే సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందట. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాల అనుమతితోనే..
ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల అనుమతితో కూడిన బస్సులను తిప్పుతున్నారు. ఎందుకంటే ఇక్కడ పనులతో పాటు రిజిస్ట్రేషన్లు ఎక్కువ మొత్తంలో కట్టాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే చాలా తక్కువ. అందుకే అక్కడి రిజిస్ట్రేషన్లు చేసుకున్న బస్సులను ఇక్కడ తిప్పుతున్నారు. ఇక్కడికంటే అక్కడ ఫిట్నెస్ పరీక్షల నిబంధనలు కూడా తక్కువ. ఆ కారణంతోనే స్లీపర్ కోచ్లు ఎక్కువగా నడుపుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల అనుమతితో తీసుకున్న బస్సులు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ మీదుగా వెళుతున్న ఈ బస్సులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నాయి. మరోవైపు అన్ని జిల్లాల్లోని ప్రధాన పట్టణాల నుంచి ఇప్పుడు ట్రావెల్ బస్సులు అధికం అయ్యాయి. అయితే ఇవేవీ నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
కేంద్రంతో సంప్రదింపులు..
ఏపీలో స్లీపర్ బస్సుల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బస్సు వేగాన్ని నియంత్రించేందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం బస్సు ప్రయాణించే దూరం ఆధారంగా గమ్యానికి చేరే సమయాన్ని కూడా నిర్ణయించి.. అంతకంటే తక్కువ సమయంలో చేరితే సిటీలోకి అనుమతించబోమని కూడా ఆయన తెలిపారు. అలాగే 300 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూస్తామని.. వీరిలో ఒకరు రాత్రిపూట డ్రైవర్ నిద్రపోయేందుకు వీలుగా బస్సులో ఓ సీటు కూడా కేటాయించేలా ప్రైవేటు ఆపరేటర్లను ఆదేశిస్తామని చెప్పారు. జాతీయ రహదారులపై బస్సుల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ గన్ ల ఏర్పాటు కోసం 40 కోట్లు కేటాయించినట్లు కూడా వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఈ కీలక ప్రతిపాదనపై.. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.