Shanthi ACB arrest: మరోసారి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో ఆమె అరెస్టు అయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆమెను జైలుకు తరలించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి వ్యవహారాలు బయటకు వచ్చాయి. అప్పట్లోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తో ఆమెకు ఉన్న సంబంధాలపై రకరకాల రచ్చ నడిచింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయి. ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఏసీబీ దాడులు ఏకకాలంలో జరగగా.. ఆదాయానికి మించిన ఆస్తులతో ఆమె పట్టుబడ్డారు. దీంతో ఆమె అరెస్ట్, రిమాండ్ చకచకా జరిగిపోయాయి.
ఆరేళ్ల క్రితం దేవాదాయ శాఖలోకి..
2020లో దేవాదాయ శాఖలో ప్రవేశించారు శాంతి. విజయవాడతో పాటు విశాఖపట్నంలో విధులు నిర్వర్తించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాంతి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కూటమి వచ్చిన తర్వాత ఆమెను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. గత నెలలోనే ఆమె సస్పెన్షన్ తొలగింది. పోస్టింగ్ కోసం ఆమె ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేశారు. అయితే కోట్లాది రూపాయల ఆస్తులను గుర్తించడంతోపాటు నేరారోపణలకు దారి తీసే కీలకపత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు విశాఖపట్నంలో ఒక నివాస ప్లాట్, తాడేపల్లి కంచనపల్లి లో ఒక జి+ 2 భవనం, సుమారు 770 గ్రాముల బంగారం ఆభరణాలు, దాదాపు 3 కిలోల వెండి వస్తువులు,రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ. 2.84 లక్షలు, ఒక వోక్స్ వ్యాగన్ పోలో కారు, ఒక మోటార్ సైకిల్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఆస్తులు గుర్తించారు. శాంతిని అరెస్టు చేసిన అధికారులు మంగళవారం రాత్రి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈనెల 21 వరకు ఆమెకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ జైలుకు తరలించారు.
భారీగా సంపాదన..
అయితే దేవాదాయ శాఖలో విధుల్లో చేరిన ఆరేళ్లకే కోట్లాది రూపాయల సంపాదన పెరగడం విశేషం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఈమె తీరు వివాదాస్పదంగా మారింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు కూడా ఆమె వివాదాల్లో వచ్చింది. దానిపై సవాళ్లు కూడా నడిచాయి. ఆమె తన తొలి భర్తకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారని కూడా సమాచారం. ఓ మామూలు అధికారిగా ఉంటూ హెలికాప్టర్లలో, ప్రత్యేక విమానాల్లో తిరిగేవారని ఆరోపణలు వచ్చాయి. గతంలో విధుల్లో ఉన్నప్పుడు ఉన్నతాధికారిపై ఇసుక విసిరి అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ఆమె తీరుతో ఆయన సెలవులోకి వెళ్లిపోయారని కూడా అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె పూర్తిగా కష్టాల్లో కూరుకు పోయారు. ఇప్పుడు ఏకంగా జైలు పాలయ్యారు.