AP Ration Card Instructions: ఏపీలో( Andhra Pradesh) రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక సూచనలు వచ్చాయి. జూన్ 1 నుంచి రేషన్ పంపిణీలో మార్పులు జరగబోతున్నాయి. ఇకనుంచి ఎండియూ వాహనాల ద్వారా కాకుండా పాత విధానంలోనే డీలర్ల వద్ద రేషన్ సరుకులు పొందాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దకే సరుకులు తెచ్చి అందిస్తారు. అంతేకాకుండా ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు తెరిచి ఉంటాయని.. ఈ మార్పులను గమనించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో పర్యటించిన షాపులో ఈపాస్ మిషన్ పనితీరును పరిశీలించారు. ఎం డి యు వాహనాలను రద్దు చేశామని.. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా సరుకులు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
* అప్పట్లో ఇంటింటికీ అంటూ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వంలో రేషన్ సరఫరా లో సమూల మార్పులు జరిగాయి. అప్పటివరకు డీలర్ల వద్ద అందిస్తున్న సరుకులు ఇంటింటా పంపిణీ చేయడం ప్రారంభించారు. తొలుత ఆ బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. అయితే రేషన్ ఇంటింటా సరఫరాకు గాను ఎండియు వాహనాలను తెరపైకి తెచ్చారు. ప్రతినెలా ఈ వాహనాలకు రూ.21 వేలను ప్రభుత్వం చెల్లించేది. అయితే డీలర్లకు కమిషన్ తో పాటు ఎండియు వాహనదారులకు సైతం భారీగా అద్దెలు చెల్లించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఐదేళ్లలో ఎండియు వాహనాలకే దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయితే ఈ విధానంపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఎండియు వాహనాల ద్వారా భారీగా బియ్యం పక్కదారి పట్టినట్లు విమర్శలు ఉన్నాయి. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పాత విధానంలోనే రేషన్ అందించేందుకు నిర్ణయించింది.
* ఇక వాహనాల ద్వారా లేనట్టే..
తాజాగా ఎండియు వాహనాల( MDU vehicles) వినియోగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుంచి ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. పాత విధానంలోనే రేషన్ డీలర్ల ద్వారా డిపోల వద్ద రేషన్ విడిపించుకోవాలని సూచించింది. అందుకు సంబంధించి సమయపాలన కూడా అమలు చేయనుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే వాహనాల ద్వారా రేషన్ అందించేవారని.. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. ఇకనుంచి రేషన్ డిపోల ద్వారా ప్రతినెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
* 10 శాతం పోనూ రిఫండ్
మరోవైపు ఎండియు వాహనదారులు తీవ్ర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారి విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎండియు వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడకుండా.. వారు కట్టిన పది శాతం డబ్బులు పోను.. మిగిలిన డబ్బులను కార్పొరేషన్ ద్వారా కట్టి వాహనాలు వారికి అప్పగిస్తామని చెప్పారు. ఎండియు వాహనాలు ఉన్నవారు ఎలాంటి ఆందోళన పడనక్కర్లేదన్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో అక్రమాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.